నంద్యాల: నంద్యాల నియోజకవర్గంలో నారాలోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా న్యాయవాదులు, జర్నలిస్టులు, టీచర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు సహా వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, ప్రజలతో లోకేశ్ భేటీ అయ్యారు..
అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అమలు చేయనున్న అంశాలపై వారితో చర్చించారు.
అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ.. ”వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎందుకు నివాళులర్పించారని అని కొందరు నన్ను అడుగుతున్నారు. వైఎస్ తీసుకున్న అన్ని నిర్ణయాలతో ఏకీభవించను. కానీ, ఆయన ఏనాడూ రాష్ట్ర పరువు తీసేలా ప్రవర్తించలేదు. వైఎస్ జగన్ మాత్రం రాష్ట్రం పరువు తీశారు. తెదేపా అధినేత చంద్రబాబు తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నింటినీ వైఎస్ కొనసాగించారు. దక్షిణ భారతదేశ బిహార్‌గా రాష్ట్రాన్ని జగన్ మార్చేశారు. ఆఖరికి మీడియా ప్రతినిధులపైనా జగన్ అండ్ కో దాడులకు తెగబడుతున్నారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టి అవమానించారు. న్యాయవాదులు, టీచర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు.. ఇలా అందరూ జగన్ బాధితులే. ఈ విషయాలపై ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించాలి.