కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో దుండగుల హల్చల్: సిగ్నల్ ట్యాంపర్ చేసి ప్రయాణికులపై దాడి,..
బంగారం, ఐఫోన్ దోపిడీ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 16 (అఖండ భూమి న్యూస్);
రైలు ప్రయాణికులకు రక్షణ కరువైంది. ఆదివారం ఈనెల 14.న రాత్రి సుమారు 11:20 గంటల సమయంలో తురకపల్లి స్టేషన్ హోమ్ సిగ్నల్ సమీపంలో కాచిగూడ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 12786) లక్ష్యంగా కొందరు దుండగులు రెచ్చిపోయారు. రైలును ఆపడం కోసం హోమ్ సిగ్నల్‌ను ట్యాంపర్ చేసిన అపరిచిత వ్యక్తులు, ఒక్కసారిగా స్లీపర్ కోచ్‌లలోకి చొరబడి చైన్ స్నాచింగ్, దొంగతనాలకు తెగబడ్డారు.
ఈ దోపిడీలో కోచ్ S-7లో ప్రయాణిస్తున్న రేణుక అనే మహిళ మెడలోని 37 గ్రాముల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లగా, అదే కోచ్‌లోని యశోదమ్మకు చెందిన 4.2 గ్రాముల నల్లపూసల దండను దొంగిలించారు. అలాగే S-4 కోచ్‌లో ప్రయాణిస్తున్న మైసూర్‌కు చెందిన వైష్ణవి అనే యువతి ఐఫోన్ 15ను, S-2 కోచ్‌లోని జె. సుచిత్ర అనే ప్రయాణికురాలికి చెందిన సుమారు 5 తులాల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు. S-6 కోచ్‌లో టి.పి. అంబికా అనే మహిళపై కూడా చైన్ స్నాచింగ్‌కు ప్రయత్నించినప్పటికీ, ఆమె అప్రమత్తమవడంతో ఆభరణాలు తప్పించుకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


