జర్నలిస్టులపై దాడి చేసిన అవినాష్ రెడ్డి అనుచరులను అరెస్టు చేయాలి

 

 

– వార్తలు సేకరణలకు వెళ్ళిన జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి

కర్నూలు అఖండ భూమి వెబ్ న్యూస్ :

కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ లో కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులను, దాడికి ప్రోత్సహించిన పెద్దలను వెంటనే అరెస్టు చేయాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) జాతీయ సమితి సభ్యులు కొండప్ప, కే నాగరాజు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(APUWJ) జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్వీ, సుబ్బయ్య, జిల్లా గౌరవ సలహాదారులు వైవీ కృష్ణా రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రదాన కార్యదర్శులు ఈ.ఎన్ రాజు, కే శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి అంజి, ఉపాధ్యక్షుడు దస్తగిరి, సహాయ కార్యదర్శులు అవినాష్, శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిరంజీవి, మధు డిమాండ్ చేశారు. వార్తల సేకరణలో భాగంగా కర్నూల్ నగరంలోని విశ్వ భారతి హాస్పిటల్ కు వెళ్లిన ఈనాడు రిపోర్టర్ రెడ్డి, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వెంకటేష్, ఆర్ టీవీ కెమెరామెన్లు చంద్రశేఖర్, నాగేష్ లపై దాడి చేసి కెమెరాలను పగలగొట్టడం జరిగిందన్నారు. మొన్నటికి మొన్న హైదరాబాదులో ఏబీఎన్, హెచ్ఎంటీవీ రిపోర్టర్ల పైన, కెమెరామెన్ ల పైన దాడి చేయడమే కాకుండా కెమెరాలను, వాహనాలను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు గడపకముందే మరొక్కసారి ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయి కర్నూల్లోని రిపోర్టర్లు, వీడియో జర్నలిస్టుపై దాడి చేయడం బాధాకరమన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దాడికి ప్రోత్సహించిన వారిపై కూడా హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో జర్నలిస్ట్ పై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వార్తలు సేకరణకు వెళ్లిన జర్నలిస్టులకు రక్షణ కరువతోందని వాపోయారు. జర్నలిస్టులపై దాడి పత్రికా స్వేచ్ఛపై దాడిగా పరిగణించాల్సిందే అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని చెప్పారు. ఇలాంటి ఘటనలను ముక్తకంఠంతో ఖండించకపోతే భవిష్యత్తులో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదన్నారు.. అదే జరిగితే పేద సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కనుక ఈ దాడులను జర్నలిస్టులతో పాటు వివిధ పార్టీల నేతలు ప్రజా సంఘాల నేతలు ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.. ఈ దాడులకు నిరసనగా సోమవారం జరిగే ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని జర్నలిస్టులను, వివిధ ప్రజా సంఘాల నేతలను కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!