సార్వత్రికంలో NDA ఓటమికి అఖిలేశ్‌ ఫార్ములా..

 

Akhilesh Yadav: సార్వత్రికంలో NDA ఓటమికి అఖిలేశ్‌ ఫార్ములా..

 

లఖ్‌నవూ: సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం ఒకే తాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి..

ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) ఎన్డీయేను ఓడించేందుకు కొత్త ఫార్ములాను సూచించారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు కలిస్తే ఎన్డీయేను సులువుగా ఓడించొచ్చని చెప్పారు. యూపీలోని 80 సీట్లలో ఓడిస్తే భాజపాను పరాజయం చేయవచ్చన్నారు. ఈ మేరకు లఖ్‌నవూలో ఎన్డీటీవీ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.

 

”ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో భాజపాను ఓడించాలంటే ప్రముఖ జాతీయ పార్టీలు మాకు అండగా ఉండాలి. యూపీలో భాజపాను ఓడిస్తే ఆ పార్టీ పనైపోయినట్లే. అలాగే, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందో చూసుకుని దానిబట్టి కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం జరగాలి” అని అఖిలేశ్‌ సూచించారు. ఈ సందర్భంగా విపక్షాల ఐక్యత గురించి ఆయనను ప్రశ్నించగా.. ”80 సీట్లలో ఓడించండి.. భాజపాను సాగనంపండి” అని నినాదం ఇచ్చారు..

ఉత్తర్‌ప్రదేశ్‌లో 80 లోక్‌సభ సీట్లు ఉండగా.. 2019 ఎన్నికల్లో ఎస్పీ కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఆ ఐదింట్లో ఇటీవల రామ్‌పూర్‌, అజంఘడ్‌ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కోల్పోయింది. భాజపా ఆ రెండు సీట్లను దక్కించుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోనూ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తుపై అఖిలేశ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిత్రపక్షాల విషయంలో తామెప్పుడూ నిజాయతీగా వ్యవహరిస్తామని చెప్పారు. సీట్ల గురించి కలహించుకునే పరిస్థితి ఉండదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలోనూ, శాంతిభద్రతలను కాపాడడంలోనూ యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ విఫలమైందని ఈ సందర్భంగా విమర్శించారు..

Akhand Bhoomi News

error: Content is protected !!