దేశ రక్షణకై బిజెపిని సాగనంపాలి.
ఎస్.రాయవరం. ఏప్రిల్ 28. అఖండ భూమి
దేశంలో బిజెపి, ప్రధాని మోడీ విధానాలతో పేద,అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ యం. సత్యన్నారాయణ అన్నారు. శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచార భేరి కార్యక్రమం లో భాగంగా రేవుపోలవరం గ్రామంలో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడుతూ అంబానీ, అదాని వంటి కార్పొరేట్ శక్తులకు దేశ సహజ వనరులను తాకట్టుపెట్టి వారికి అప్పనంగా సమర్పించి భవిష్యత్ తరాలకు లేకుండా చేస్తున్నారన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి తొమ్మిదేళ్లగా ఉన్న ఉపాధికే ఎసరు పెట్టారని,రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడిస్తేనే ప్రజలకు,దేశానికి మేలు జరుగుతుందని, కుల మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు రేపుతూ మోడీ,బిజెపి విధానాలు వ్యతిరేకించే వారిపై భౌతిక దాడులు, హత్యలు, హత్యాచారాలు,నిర్బంధ చర్యలు ప్రయోగిస్తున్నారన్నారు. కాబట్టి దేశంలో మోడీ ని తరిమికొట్టాల్సిన తరుణం ఆసన్నమైందని,రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ,మోడీ విధానాలకు పార్లమెంటులో చేతులెత్తి సమర్ధిస్తుందన్నారు. దీంట్లో భాగంగానే గంగవరం పోర్ట్ అమ్మకం, రైల్వే స్టేషన్ల అమ్మకం, రైతులకు స్మార్ట్ మీటర్ల బిగింపు వంటి చర్యలన్నీ అమలవుతున్నాయని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తామని ఇక్కడ ప్రగల్బాలు పలుకుతూ అక్కడ ప్రైవేటీకరణ విధానాలకు పార్లమెంటులో చేతులెత్తుతున్నారని అన్నారు. చిత్తశుద్ధి లేకుండా రెండు నాల్కల ధోరణితో రాష్ట్రంలో పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ సందర్బంగా ఉపాధి హామీ నిధులు పెంచాలని 600 రూపాయల కూలీ 200 రోజుల పని దినాలు కల్పించాలని పనిచేస్తున్న చోట కూలీలకు నీడఏర్పాటు చేయాలని, పే స్లిప్పులు వారం రోజులకి డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.