సమ్మెబాటలో విద్యుత్తు ఉద్యోగులు
నేటి నుంచి రిలే దీక్షలు

భారీ ర్యాలీ నిర్వహించిన సీలేరు విద్యుత్తు ఉద్యోగులు
అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి సీలేరు (అఖండ భూమి): ప్రముఖ జలవిద్యుత్ కేంద్రం సీలేరు విద్యుత్తు ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం కొరకు సమ్మె బాట పట్టనున్నారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి రీలే దీక్షలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా సీలేరు, డొంకరాయి, మోతుగూడెం లలో విద్యుత్తు ఉద్యోగులు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా యాజమాన్యం తీరుకు నిరసనగా నినాదాలు చేశారు.
ఈ సం దర్భంగా విద్యుత్యు ఉద్యోగుల ఐకాస నాయకులు మాట్లాడుతూ ఎపి జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్లలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిస్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 2 నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు, ఆగష్టు 10 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు యాజమాన్యం పరిష్కరించకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తుందే తప్ప ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించే వాతావరణం కనబడలేదని మండిపడ్డారు. వేతన సవరణ గడువు ముగిసి 16 నెలలు దాటినా ఇప్పటివరకు కొత్త వేతన సవరణ ప్రకటించలేదని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగులకు 45 శాతం ఫిట్మెంట్తో పిఆర్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. చివరకు ఒకటో తారీఖున వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. జీతాలు ఎప్పుడు అందుతాయో అంటూ ఉద్యోగులు ఎదురు చూడాల్సిరావడం దారు ణమన్నారు. సమస్యల పట్ల యాజమాన్యానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధం చేసుకోవాలన్నారు. ముఖ్య మంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ కాంట్రాక్టు కార్మికులందరికీ పర్మినెంట్ చేయాలని, ఇపిఎఫ్ కింద ఉన్న ఉద్యోగులందరినీ జిపిఎఫ్కి మార్పు చేసి పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న సదస్సును జయప్రదం చేయాలని, చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణకు ఉద్యోగులు, కార్మికులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్తు ఉద్యోగ జేఏసీ నాయకులు కిరణ్, రత్నాకర్, చంద్రమోహన్, జయశంకర్, ఎం.శ్రీను తదితరులు పాల్గొన్నారు.


