తెలంగాణలో కాంగ్రెస్ వస్తే అరాచకమే. మంత్రి కేటీఆర్
మూడోసారి.. భారత్ వరల్డ్‌కప్ గెలుస్తుంది.. కేసీఆర్ సీఎం అవుతారురాష్ట్రంలో భాజపా రేసులోనే లేదు…
ఆ రెండు పార్టీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదు కేసీఆర్ ఆ రెండింటికీ కొరకరాని కొయ్య ‘ఈనాడు’ముఖాముఖిలో మంత్రి కేటీఆర్…..
పోటీలో లేనోళ్లతో యుద్ధం ఏం చేస్తామని భాజపాను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మోదీ, అమిత్‌షా, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సామంతులు ఎందరొచ్చినా.. ఎన్ని జాకీలు పెట్టి లేపినా.. ఆ పార్టీ లేవదని పేర్కొన్నారు. ఎన్నికల్లో నూటికి నూరు శాతం తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సేనని.. ఆ పార్టీ దేశానికి, రాష్ట్రానికి చేసిన అన్యాయం, ఘోరాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ కొంత పుంజుకున్నట్లు కనిపించినా.. విజయం సాధించలేదని వ్యాఖ్యానించారు. తమపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు కూడా తమ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాయని ఈనాడుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ చెప్పారు. వివరాలివీ..
ఈనాడు, హైదరాబాద్: ”రాష్ట్ర ప్రజలు గెలవాలని భారాస కోరుకుంటోంది. తెలంగాణను గెలవాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ఆ క్రమంలో తెలంగాణ ప్రజలు ఓడిపోయినా పరవాలేదనేది కాంగ్రెస్ వైఖరి” అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. దేశానికి, తెలంగాణకు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదన్న ఆయన.. ‘ఆ పార్టీ అభివృద్ధి చేయదు. ఎవరైనా చేస్తుంటే వారికి ఏడుపెక్కువ. కుంభకోణాల కుంభమేళా చేసే పార్టీ అది. వారు అధికారంలోకి వస్తే కష్టాలు, కన్నీళ్లు, అంధకారం, మతకలహాలతో అరాచకమే” అని పేర్కొన్నారు. ఆ పార్టీ నేతల ఆరోపణలను ప్రజలు అంత సీరియస్‌గా తీసుకోరని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ఫలమే లేకపోతే.. తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు ఎలా పెరిగాయి? 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ నుంచి 3.5 కోట్ల టన్నుల ధాన్యం సేకరించే స్థితికి ఎలా చేరింది? అని సూటిగా ప్రశ్నించారు. సంవత్సరానికి 16 వేల నియామకాలు చేసిన ఘనత తమదని వివరించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ భరోసా కింద మ్యానిఫెస్టోలో పెట్టిన 15 అంశాలను సమర్థంగా అమలుచేస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
*మేం ఎవరికీ బీ టీం కాదు. కాంగ్రెస్, భాజపాలకు కేసీఆర్ కొరకరాని కొయ్య. ఎవరైనా సరే వాళ్ల కింద సామంతుల్లా ఉండాలనేది ఆ రెండు జాతీయ పార్టీల అహంకారం. కేసీఆర్ స్వతంత్రంగా ఉంటానంటే వాళ్లకు నచ్చదు. అందుకే కాంగ్రెస్ కాళేశ్వరంపై ఒక ఆరోపణ చేస్తుంది.. దీనికి తగ్గట్లుగా భాజపా ఒక నివేదికను విడుదల చేస్తుంది. ఇది వాళ్ల పన్నాగం. కేసీఆర్‌ను తెలంగాణలోనే నిలువరించాలి.. బయటకు రానీయకూడదు.. వాళ్లకు పోటీగా శక్తిగా ఎదగకూడదు.. ఇది వాళ్ల కుయుక్తి.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాల మెడలను ప్రజలే వంచుతారు. కేసీఆర్ అనేక మూస ధోరణులను బద్దలు కొట్టారు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించారు. క్రికెట్‌లో భారత్ మూడోసారి వరల్డ్‌కప్ గెలుస్తుంది. ఇక్కడ కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు.*
*దొరలకు, ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని రాహుల్‌గాంధీ అంటున్నారు. వాస్తవానికి దిల్లీ దొరలకు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. ఒక దొర మోదీ అయితే, ఇంకొక దొర రాహుల్ గాంధీ..*
గత ఎన్నికలప్పుడు కూడా కాంగ్రెసోళ్లు ఇదే హడావిడి చేశారు. ఇళ్లకు సున్నాలు వేయించుకున్నారు. లాల్చీ జుబ్బాలు కుట్టించుకున్నారు. తెరాస ఓడిపోతుందని తప్పుడు సర్వేలు వెల్లడించారు. కానీ ఏమైంది? మాకు ఇవేమీ కొత్త కాదు. వారి బిడ్డ కేసీఆర్‌కే మళ్లీ ఓటేయాలని ప్రజలకు తెలుసు..
ఒక గుజరాతీ వచ్చి మీకు స్వాతంత్య్రం ఇచ్చారు.. మరో గుజరాతీ వచ్చి మీకు స్వేచ్ఛ కల్పిస్తారని మోదీ అంటున్నారు. తెలంగాణలో పౌరుషం ఉన్న వాళ్లు లేరా? దిల్లీ, గుజరాత్ వాళ్లొచ్చి మనల్ని విడుదల చేయాలా? ఇవాళ కేసీఆరే దిల్లీకి బయలుదేరుతున్నారు..



