ప్రజాస్వామ్యానికి ఓటే పునాది.

 

 

ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది..డా. ఊహ మహంతి, డైరెక్టర్, రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ, విశాఖపట్నం.దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నది. తమ నాయకులను ఎన్నుకోవడానికి, తమ దేశం ఎలా నడుస్తుందో చెప్పడానికి ఓటింగ్ ఒక ముఖ్యమైన మార్గం. ఇది ప్రజాస్వామ్య సమాజంలో స్వేచ్చ, స్వాతంత్ర్య భావనను సృష్టించడానికి సహాయపడుతుంది.సర్వ స్వతంత్ర, లౌకిక, సామ్యవాద, సర్వ స్వతంత్ర దేశం అయినా అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. ప్రజాస్వామిక భారతదేశం లో ప్రతి ఒక్కరికి ఓటు ఒక వజ్రాయుధం అలాంటి ఓటుకి ఎంత పవర్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యుల ఓట్లు మాత్రమే స్థానిక, ప్రాంతీయ, జాతీయ స్థాయిలలో ఎవరు అధికారాన్ని చేపట్టాలో నిర్ణయిస్తాయి. తద్వారా దేశం విధానాలు, దిశను నిర్దేశిస్తాయి. కాబట్టి ఓటింగ్‌కి ఎంతో ప్రాధాన్యత ఉంది. కాలానుగుణంగా జనాభా అవసరాలు, ఆకాంక్షలు మారుతున్నందున, దేశ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దడంలో యువత ఓటింగ్ మరింత ఇంపార్టెంట్‌గా మారింది.కాని ఇప్పుడున్న అవినీతి, కుళ్లు రాజకీయాలను చూసే యువతకు ఓటు పట్ల ఆసక్తి తగ్గుతోంది, నేను ఒక్కణ్ని ఓటు వెయ్యకపోతే ఏమవుతుంది… ఏం కాదులే అని చాలా మంది భావిస్తున్నారు. నీటి చుక్కలన్నీ కలిస్తేనే సముద్రం కదా.. అలాగే అందరూ ఓటు వేసినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. అందుకే యువ తరం ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేలా, దేశ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా ఎంకరేజ్ చేయాలి. ఐదేళ్లకోసారి ఒక్కగంట కేటాయిస్తే చాలు.. తమ తలరాతలు మార్చే ప్రతినిధిని ఎన్నుకోవచ్చన్న వాస్తవాన్ని గుర్తుచేయాలి. ఓటేసినప్పుడే ప్రజాప్రతినిధిని ప్రభుత్వాన్ని నిగ్గదీసి, నిలదీసే హక్కు ఉంటుందని తేలియజేయాలి. ఒకవేళ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ‘నోటా’ బటన్‌ నొక్కినా ఓటు హక్కు వినియోగించుకున్నట్లే అని చెప్పాలి. ఓటింగ్ అంటే మీకోసం, దేశప్రగతి కోసం, మీరు నిలబడటం. అలాంటప్పుడు మీరే ఓటు వేయకపోతే మరి ఇంకెవరు వేస్తారు?. మీకోసం, మీ వలన, మీ చేత ఎన్నుకోబడేదే ప్రభుత్వం. అందుకే మీరు ప్రేక్షకపాత్రను వీడాలి. ఫిర్యాదుదారులుగా, విమర్శకులుగా ఉండిపోకూడదు. ప్రజాస్వామ్యంలో భాగస్వాములవ్వాలి.అన్నింటినీ అరచేతిలోకి తీసుకొచ్చింది ఇంటర్నెట్. అన్ని వ్యవహారాలు ఎలా సాగుతాయి, మీ అభ్యర్థులు ఎవరు, వాళ్ల ప్రణాళికలేంటీ అన్నవి తెలుసుకొండి. న్యూస్ పేపర్ చదవండి, వార్తలు చూడండి, స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని అడగండి. దయచేసి ఓటు వేసే విషయంలో ఉదాసీనతను చూపించొద్దు మీ భవిష్యత్తును నిర్ణయించాల్సింది మీరే. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అందుకే ప్రతి ఒక్కరు మీ ఓటును ప్రలోభాలకు గురి కాకుండా నిర్భయంగా వినియోగించుకొండి. ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయండి. మీరు ఎన్నుకునే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి అందుకే ఆ విలువైన ఓటును నోటుకు అమ్ముకోవద్దు. ఓటు హక్కు ఎంతో పవిత్రమైనది దానికి ఎంతో సార్థకత ఉంటుంది. మీకు తెలుసా ఇప్పటికీ ఓటు హక్కు లేక ప్రభుత్వాలను ఎన్నుకోలేకపోతున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. ఓటు వేయడం మన హక్కు. ఈ హక్కు కోసమే మన పూర్వీకులు ఎన్నో పోరాటాలు చేశారు. మనకు లభించే ఈ వోట్ హక్కును స్వచ్ఛందంగా అందిపుచ్చుకుందాం!!

 

Akhand Bhoomi News

error: Content is protected !!