ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 122 మంది నకిలీ వైద్యులు 

 

 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 122 మంది నకిలీ వైద్యులు

భద్రాద్రి కొత్తగూడెం,జూన్ 19(అఖండభూమి) ఎలాంటి అర్హత లేకుండానే వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లకు తెలంగాణ రాష్ట్ర మెడికల్కౌన్సిల్ (టీజీఎంసీ) చెక్పెట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్మిషన్లు లేకుండా,ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల ముసుగులో వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లకు సంబంధించిన క్లినిక్స్పై దాడులు చేసింది. ఇప్పటి వరకు122 మంది ఎలాంటి అర్హత లేకుండానే వైద్యం చేస్తున్నారని ఆఫీసర్లు గుర్తించారు.ఇంకో 120 మంది ఫేక్ డాక్టర్లున్నట్టు భావిస్తున్నారు.తాజాగా పలు మండలాల్లో తెలంగాణ రాష్ట్ర మెడికల్కౌన్సిల్ (టీజీఎంసీ), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు తనిఖీలు నిర్వహించారు.

30 మంది సభ్యులు 10 టీమ్స్గా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు.ఇందులో ఆర్ఎంపీలు,పీఎంపీలుగా చలామణి అవుతూ, అర్హత లేకున్నా అన్ని రకాల వైద్య చికిత్స చేస్తున్నారని తేల్చారు. విచ్చలవిడిగా పేషెంట్లకు యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్,పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారని,ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల ముసుగులో ఆపరేషన్లు కూడా చేస్తున్నారని గుర్తించారు.సీక్రెట్ గా అబార్షన్లు,మోకాళ్ల నొప్పులకు స్టెరాయిడ్స్ వినియోగిస్తూ,పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని నిర్ధారణకు వచ్చారు.122 మందిపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.

– ఎక్కడెక్కడ తనిఖీలు..

ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి,తల్లాడ, వైరా,ఏన్కూరు, ముదిగొండ, జూలూరుపాడు,కల్లూరు, రఘునాథపాలెం, కామేపల్లి,కొత్తగూడెం, సుజాతనగర్,కారేపల్లి, ములకలపల్లి,టేకులపల్లి, ఇల్లెందులో ఈ టీమ్ లు తనిఖీలు చేశాయి. ఆర్ఎంపీ,పీఎంపీలుగా బోర్డులు పెట్టుకొని, ఎలాంటి మెడికల్ క్వాలిఫికేషన్లు లేకున్నా వైద్యం చేస్తున్నారని నిర్ధారణ చేశారు.

Akhand Bhoomi News