తాత్కాలిక అధ్యాపకులను గుర్తించాలి…
మేనిఫెస్టో ప్రకారం మాట నిలబెట్టుకోవాలి
జీవో 21 రద్దు చేయాలి
కామారెడ్డి, జిల్లా ప్రతినిధి ; ఏప్రిల్ 10 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల విశ్వవిద్యాలయాలలో సహాయ ఆచార్యుల నియామకానికై విడుదల చేసిన జీవో 21 ని వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఆ జీవోలో తాత్కాలిక అధ్యాపకులకు సంబంధించిన సర్వీసులు పరిగణలోకి తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము గత కొన్ని సంవత్సరాలుగా అన్ని అర్హతలు కలిగి ఉండి వివిధ విభాగాలలో తాత్కాలిక అధ్యాపకులుగా పనిచేస్తున్నామని, ఇప్పటికీ తమకు ఉద్యోగ భద్రత లేకపోయినా అర్ధాకలి, అరకొర జీతాలతో తాము పనిచేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో తాత్కాలిక ఆధ్యాపకులకు 12 నెలల 50 వేల రూపాయలతో కూడిన వేతనం అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక తమ ఊసే మర్చిపోయారని వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గతంలో ఈ సమస్యపై ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు తమ గోడు వెళ్ళబోసుకుంటూ అనేకమార్లు వినతి పత్రాలను అందజేశామని తెలిపారు. వారు ప్రతిస్పందిస్తూ ప్రభుత్వం దృష్టికు మీ సమస్య తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 12 విశ్వవిద్యాలయంలో గత రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న సుమారు 1000 మంది తాత్కాలిక అధ్యాపకుల కుటుంబాలను రోడ్డున పడకుండా వెంటనే ప్రభుత్వం చర్య తీసుకుని తమను ఆదుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొన్నారు.