గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
అనకాపల్లి జిల్లా, నాతవరం మండలం: అందరి ఇళ్లలో పండుగ వెలుగులు నిండుతుంటే, గునుపూడిలోని పేద కుటుంబాల్లో మాత్రం చీకట్లు అలముకున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా పెంచి ఇచ్చే ఆసరా పెన్షన్లే దిక్కుగా బతికే వృద్ధులు, వితంతువుల కడుపు కొట్టి, కొంతమంది అక్రమార్కులు తమ జేబులు నింపుకుంటున్న దారుణ ఘటన అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గునుపూడి గ్రామంలో వెలుగుచూసింది.
పండుగ చందా పేరిట భారీ దోపిడీ!
ప్రభుత్వం పంపిణీ చేసే రూ. 4000 పెన్షన్‌లో “పండుగ చందా” అంటూ సిబ్బంది అడ్డగోలుగా రూ. 1000 కోత విధిస్తున్నారు. లబ్ధిదారుల చేతికి కేవలం రూ. 3000 మాత్రమే ఇస్తూ దౌర్జన్యానికి దిగుతున్నారు. వృద్ధులు మందుల కోసం, పూట గడవడానికి ఉపయోగపడే సొమ్మును లాక్కోవడం దారుణమని, ఏ ఆధారం లేని వృద్ధులు, వితంతువులు తమకు ప్రభుత్వం ద్వారా అందుతున్న అరకొర సాయం కూడా అందకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.
ఈ వ్యవహారంలో సిబ్బంది అరాచకం పరాకాష్టకు చేరింది. కొంతమంది సిబ్బంది మొదట తెలియక లబ్ధిదారులకు పూర్తి పెన్షన్ (రూ. 4000) పంపిణీ చేశారు. అయితే, ఆ తర్వాత, ‘వసూళ్ల’ టార్గెట్ కోసం సదరు లబ్ధిదారులతో “వెంటనే రూ. 1000 వెనక్కి ఇవ్వాలి” అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే పెన్షన్ కట్ చేస్తామని భయపెడుతుండటంతో బాధితులు వణికిపోతున్నారు.
పేదల కన్నీరు.. అక్రమార్కుల విందులు
ఆకలితో ఉన్న పేదల నోటికాడి కూడును లాక్కుని కొంతమంది స్వార్థపరులు జేబులు నింపుకుంటున్నారు.
పండగ పేరు తో పేదల కన్నీటితో వసూలు చేసిన ఈ సొమ్ముతో కొంతమంది విందులు చేసుకుంటున్నారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి.
”మా ఆకలి కేకలు మీకు వినపడటం లేదా?” అంటూ గునుపూడి గ్రామ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కళ్లముందే ఇంత అన్యాయం జరుగుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, గునుపూడిలో జరిగిన ఈ పెన్షన్ దందా’పై సమగ్ర విచారణ జరపాలి. అక్రమంగా వసూలు చేసిన సొమ్మును తిరిగి బాధితులకు అందజేయడంతో పాటు, ఈ దోపిడీకి పాల్పడిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


