సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా భూభారతి చట్టం రూపొందించాం
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ;ఏప్రిల్ 29,( అఖండ భూమి న్యూస్) ;
సామాన్య ప్రజలకు అర్ధమయ్యే విధంగా భూ భారతి చట్టం తయారు చేయడం జరిగిందని, చట్టం తో పాటు రూల్స్ తయారు చేయడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని శేట్పల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భూ భారతి 2025 చట్టం ప్రజలకు అర్థమయ్యే విధంగా, 18 రాష్ట్రాలు పర్యటించి 9 నెలలపాటు మేధో మధనం చేసి అధికారులు, మేధావుల సలహాలతో రూపొందించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం 2020 సంవత్సరంలో తీసుకువచ్చిన చట్టంలో నిబంధనలు లేవని తెలిపారు. అసెంబ్లీ లో చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. భూ భారతి చట్టం 50 సంవత్సరాల పాటు నిర్వహి చాలని తెలిపారు. 14.4.2025 న ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ చట్టం గురించి అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని 4 జిల్లాల్లోని ఒక్కో మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద సదస్సులు నిర్వహించడంతో పాటు ప్రజల సమస్యలపై దరఖాస్తులు తీసుకోవడం జరుగుచున్నదని తెలిపారు. అందులో భాగంగానే ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని లింగంపేట్ మండలాన్ని ఎంపిక చేయడం జరిగిందని, ఇప్పటివరకు 20 గ్రామాలలో సదస్సులు నిర్వహించి 3400 కు పైగా అభ్యర్థన దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని తెలిపారు
తరతరాల నుండి సాగుచేస్తున్న భూ యజమానులకు పాసుపుస్తకాలు జారీచేయడం, తప్పులుగా నమోదు చేసిన పేర్లు సరిచేయడం, భూములు సరిచేయడమే భూ భారతి చట్టం ఉద్దేశ్యమని తెలిపారు. తహసీల్దార్ తప్పు చేస్తే ఆర్డీఓ కు అప్పీలు చేసుకునే విధంగా, ఆర్డీఓ ఇచ్చిన తీర్పులో అన్యాయం జరిగితే కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పు అభ్యంతరం ఉంటే ల్యాండ్ ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. అధికారులు తప్పులు చేస్తే చర్యలుతప్పవని అన్నారు. రాష్ట్రంలో 10956 గ్రామాలకు త్వరలో గ్రామ రెవిన్యూ అధికారులను నియమించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 1000 మంది సర్వేలను నియమించడం జరుగుతుందని తెలిపారు. లింగంపేట్ మండలంలోని సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. భూములు సర్వే చేసి పాస్ బుక్కులో ఎక్కించడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 15 నాటికి అన్ని మండలాల్లో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతీ నియోజక వర్గంలో నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని, ప్రతీ నియోజక వర్గంలో 3500 ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రానున్న 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లకు శ్రీకారం చుడుతున్నామన్నారు.
పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో భూ భారతి చట్టం విప్లవాత్మకమైన చట్టమని అభివర్ణించారు. ధరణీ వలన భూ స్వాములకు లాభమయ్యిందని తెలిపారు. భూ భారతి చట్టం వలన పేద వర్గాల వారికి న్యాయం జరుగుతుందని అన్నారు.
ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ రావు మాట్లాడుతూ, భూ భారతి చట్టం తో పాటు రూల్స్ పెట్టడం జరిగిందన్నారు. గ్రామ పరిపాలనాధికారులను ప్రభుత్వం నియమిస్తున్నదని తెలిపారు. ధరణీ వలను ప్రజలు సమస్యలను ఎదుర్కొన్నారని, ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. భూ భారతి రెండంచెల వ్యవస్థ అని, పేద వర్గాల వారికి న్యాయ సహకారం అందించడం జరుగుతుందని వివరించారు. వారసత్వం, అసైన్మెంట్, దేవాలయ భూములకు ఈ చట్టం వలన పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, భూ భారతి చట్టం గురించి, పైలెట్ ప్రాజెక్ట్ కింద లింగం పేట్ మండలంలో చేపడుతున్న కార్యక్రమ వివరాలు వివరించారు.
అంతకుముందు మంత్రికి హేలీ ప్యాడ్ వద్ద అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజేష్ చంద్ర, సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జిల్లా గ్రంధాలయ అధ్యక్షుడు మద్ది చంద్రకాంత్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.