బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి
– ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్
– బీకాం బీఎఫ్ఎస్ఐ వంటి కోర్సులతో స్వయం ఉపాధి అవకాశాలు
– దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు కళాశాలలో స్వచ్ఛంద సహాయ కేంద్రం
బెల్లంపల్లి మే 09(అఖండ భూమి న్యూస్ ):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరం 2025-26లో డిగ్రీలో చేరేందుకు గాను బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ పిలుపునిచ్చారు. అధునాతన సౌకర్యాలు మరియు ఎన్నో పేరు ప్రఖ్యాతులు గల ఈ కళాశాలలో చేరడం ద్వారా విద్యార్థులు మంచి భవిష్యత్తును ఎంచుకున్నట్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కొత్త కోర్సులు అందుబాటులోకి తెచ్చామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు38 సంవత్సరాల కళాశాల చరిత్రలో మొట్టమొదటిసారి బీకాం విభాగంలో బిఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్) కోర్సును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కోర్స్ ద్వారా డిగ్రీ పూర్తి కాగానే విద్యార్థులకు వెంటనే స్వయం ఉపాధి అవకాశాలు మెరుగ్గా లభిస్తాయని వివరించారు.
వినూత్న కోర్సులు.. విభిన్న సబ్జెక్టులు
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఏ.లో- హిస్టరీ, ఎకనమిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్, బి.కాం.లో బీ ఎఫ్ ఎస్ ఐ బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, బి.కాం టాక్సేషన్,బి .కాం కంప్యూటర్స్, బి.ఎస్సి లైఫ్ సైన్స్, బాటని జువాలజీ కెమిస్ట్రీ కంప్యూటర్ బి.ఎస్సి. ఫిజికల్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్దేశించుకుని తగిన కోర్సులు, సబ్జెక్టులు ఎంపిక చేసుకోవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా పీజీ కోర్సులు ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంకామ్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డిగ్రీ తర్వాత పీజీ కూడా ఇక్కడే చేసే అవకాశం ఉంటుందని వివరించారు.
*విద్యార్థుల సహాయార్థం ఉచిత సేవలు*
ప్రస్తుత విద్యా సంవత్సరంలో బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలనుకునే విద్యార్థుల కోసం కళాశాలలో స్వచ్ఛంద సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఆయా కోర్సులు, సబ్జెక్టుల ఎంపిక, దరఖాస్తు విధానం తదితర సందేహాల నివృత్తి కోసం విద్యార్థులు కళాశాలలో సంప్రదించవచ్చని సూచించారు. జాతీయ స్థాయి న్యాక్ బి గ్రేడు కలిగిన ఈ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపాలని..ఈ దిశగా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ కోరారు. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నెంబర్ 9959269975లో కళాశాలలో సంప్రదించాలని సూచించారు.