ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు వేగవంతంగా నిర్మించుకోవాలి…

ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు వేగవంతంగా నిర్మించుకోవాలి…

రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 29 (అఖండ భూమి న్యూస్)

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరూ త్వరగా ఇండ్లు నిర్మించుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. శుక్రవారం బాన్సువాడ లో బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల మహిళా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల అవగాహన సదస్సు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద వాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్వంత ఇంటి స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్ల నిర్మాణాలను త్వరగా నిర్మించుకోవాలని తెలిపారు. రాష్ట్రం లోని మహిళల సంక్షేమం కోసం ఆర్టీసీ లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించిందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూ. లకే వంట గ్యాస్ సిలెండర్, సన్న బియ్యం, రుణ మాఫీ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నదని తెలిపారు. 8 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ ప్రతీ నెల 6500 కోట్ల వడ్డీ చెల్లిస్తూ ప్రభుత్వం పేద వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి అద్దె చెల్లిస్తున్నారని, పెట్రోల్ బంక్ లను, సోలార్ పవర్ యూనిట్లను మంజూరు చేయడం జరుగుతున్నదని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకానికి 8 వేల కోట్లతో పథకాన్ని ప్రారంభించడం జరుగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో పిల్లలు పక్కదారి పట్టకుండా భద్రంగా చూసుకోవాలని, గంజాయి వంటి మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా చూడాలని మహిళలకు తెలిపారు.

బాన్సువాడ శాసన సభ్యులు , ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై అవగాహన కల్పించామని, ప్రతీ నియోజక వర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేయడం జరుగుతున్నదని తెలిపారు. మంజూరు అయిన లబ్ధిదారులు త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని తెలిపారు. బీర్కూర్ మండలంలో 370, నసురుల్లాబాద్ మండలంలో 374 మందికి ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు వెంటనే నిర్మించుకొని దశల వారీగా 5 లక్షలు పొందాలని తెలిపారు. నిరుపేద మహిళలకు ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి కావలసిన స్టీల్, సిమెంట్ ముడిసరుకు మండల ధరల నియంత్రణ కమిటీలను వేయడం జరిగిందని, ఇసుక ఉచితంగా పొందవచ్చని కాని రవాణా, లేబర్ ఖర్చులు లబ్ధిదారుడు చెల్లించాలని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. ఈ సమావేశంలో ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!