జన గణనలో కుల గణన-పారదర్శకత ఎలా?..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూన్ 7 (అఖండ భూమి న్యూస్);
కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 30,2025 న తీసుకున్నటువంటి రాబోయే జనగణలో కులగణన నిర్ణయం యావత్ భారతాన్ని సంభ్రమాశ్చర్యములకు గురిచేసింది .ఇది ఓబీసీ ల చిరకాల డిమాండ్. నిజానికి ఇది వెనుక బడిన,అత్యంత వెనుక బడిన కులాలకు సామాజిక న్యాయాన్ని అందించడంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించ బోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.భారతదేశంలో కులము, మతము, రిజర్వేషన్లు అత్యంత సున్నితమైన, బావోద్వేగముతో కూడుకున్న అంశాలు. స్వాతంత్ర భారతంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మొదటి ప్రయత్నం. బ్రిటిష్ పాలనలో 1881 నుంచి 1931 వరకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన జరిగింది. కానీ స్వతంత్ర భారతదేశంలో కారణాలు ఏవైనా 1951 నుంచి నేటి వరకు సెన్సెస్ లో కులగణన జరగలేదు. కేవలం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి లెక్కలు మాత్రమే సేకరించడం జరిగింది.
మరి ఇది నేడు దేశ వ్యాప్త ఓబీసీల ఉద్యమ విజయమా లేదా ఇతరత్రా రాజకీయ కారణాల వలన అనే విషయలను ప్రక్కనపేడితే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం శుభసూచకం, ఇది మరో సామాజిక విప్లవంనకు నాంది పలక బోతుంది అనేది వాస్తవం. నిన్నటి వరకు జన గణన లో కుల గణన పై అనేక విష ప్రచారాలు జరిగినాయి. కులగణన జరిపితే హిందూ సమాజం విభజింపబడుతుందని, దేశ సమైక్యతకు, సమగ్రతకు భంగం కలుగుతుందని, కులం అనేది విదేశీ భావనని, ఏక్ హై తో సేఫ్ హై అని, కుల గణనను కోరేవారు దేశ ద్రోహాలని, కొన్ని కులాలు ఒక్కో రాష్ట్రములో ఒక్కో విధంగా వర్గీకరణ చేయ బడ్డాయని, కాబట్టి కుల గణన చేయడం అసాధ్యమని, పరిపాలన రీత్యా సాధ్యం కాదని రకరకాలుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు నిర్ణయం జరిగిపోయింది. కాబట్టి అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ఇప్పుడు మన ముందున్నటువంటి కర్తవ్యం ఈ జరగబోయే కులగణన ఏ విధంగా ఉండాలి, ఎంత పారదర్శకంగా ఉండాలి, ఎంత విశ్వసనీయత తో ఉండాలి. రేపు రాబోయే కాలంలొ దేశం ఎదురుకుంటున్న అనేక సమస్యలకు ఎలా పరిష్కారం సూచిం బొతుంది అనేది ముఖ్య మైన ప్రశ్న.
2011లో ఉన్న కేంద్ర ప్రభుత్వంలాగా ఏవో కుంటుసాకులు చెప్పి మళ్లీ ఈ జనగణనలో కులగణన జరుపకుండా, వాయిదా వేయకుండా, ఇప్పుడున్న ప్రభుత్వం తన నిర్ణయం మీద నిలబడాలి. ప్రజలు కూడా మరొకసారి మోసగించబడకుండా తగు జాగరూకతతో ఉండాలి. 2011లో జనగణనలో కులగణన చేస్తామని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షి గా ప్రకటించి, మరుసటి రోజే మళ్లీ మేము జనగణనలో కులగణన చేయము, దాని కొరకు ప్రత్యేకించి సామాజిక, ఆర్థిక, కుల గణన చేస్తామని చెప్పి ఆ సోషల్ ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేసి ఆ రిపోర్ట్లు కూడా బయట పెట్టలేక పోయింది. తర్వాత ఆ సెన్సస్ లో తప్పులు ఉన్నాయని చేతులు దులుపి వేసుకుని, ఆ రిపోర్ట్ ను బుట్ట దాఖలు చేయటం జరిగింది. ఐదువేల కోట్ల ప్రజాధనం వృధా అయ్యింది. ఆపరేషన్ విజయ వంతమైంది కానీ రోగి చనిపోయినట్టుగా ఉంది ఈ ఉదంతం.
ఈసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే ఈ జనగణనలో కులగణని చిత్తశుద్ధితో చేయాలి. ముఖ్యంగా గత అనుభవాల దృష్ట్యా కుల గణన పారదర్శకతో, నిజాయితీ తో జరపాలి. అప్పుడే అది అందరికీ ఆమోద యోగ్యంగా , ప్రయోజన కారిగా ఉంటుంది. మొదట ఈ కుల గణన అనేది సెన్సస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే జరగాలి. గతంలో సోషియో ఎకానమిక్,కుల గణన చేసినప్పుడు గ్రామీణ ప్రాంతంలో రూరల్ డెవలప్మెంట్ శాఖ వారు ,పట్టణ ప్రాంతంలో అర్బన్ డెవలప్మెంట్ శాఖ వాళ్ళు చేయడంతో వీరికీ ఆ వృత్తి నైపుణ్యం లేక ఆ సెన్సెస్ ఒక తప్పుల తడకగా, ఒక ప్రహసనముగా మారింది. సెన్సెస్ డిపార్ట్మెంట్ లో శిక్షణ పొందిన అధికారులు ఉంటారు. సంపూర్ణ పర్య వేక్షణ ఉంటుంది. వారికి గత అనుభవం ఉంటుంది. జన గణనలో వారు ప్రొఫెషనల్స్ కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ద్వారా జరిగితేనే సెన్సస్ కు న్యాయం జరుగుతుంది. ఒక విశ్వసనీయత ఉంటుంది .డాటా ఖచ్చితత్వం ఉంటుంది.
రెండవది ఇది జనగణనలో భాగంగా ఉండాలి కానీ మళ్లీ దీని కొరకు సెపరేట్ ఫారం ఉండ కూడదు, లేనట్లయితే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. మూడోది ఈ సెన్సెస్ లో కులగణన జరుగుతుంది కాబట్టి అన్ని కులాల లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల లెక్కలు మాత్రమే తీయడానికి కాదు. దేశంలో అన్ని కులాల లెక్కలు తీయాలి, అదే విధంగా ముస్లింలలో క్రిస్టియన్స్ లో ఉన్నటువంటి కులాల లెక్కలు కూడా గణించ వలసిన అవసరం ఉంది.
నాలుగోది ప్రతి కులానికి ఒక కోడ్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే అనేక కులాలు పుట్టుకు వచ్చి డాటా స్వచ్ఛత దెబ్బ తింటుంది. ఉదాహరణకు ఒకే కులంను ఒకే రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక పేరుతో పిలుస్తారు. ఉదాహరణకు చాకలి వారిని కొన్ని ప్రాంతాల్లో రజక అంటారు కొన్ని ప్రాంతాల్లో ధోబి అని పిలుస్తారు. కాబట్టి వీరందరిని ఒకే కోడ్ నంబర్ లోకి తీసుకొచ్చినట్టయితే కులాల లెక్కలు మనకు కరెక్ట్ గా వస్తాయి. అలాగే ఓసి కులాలకు కూడా కోడ్ నంబర్ ఇవ్వాలి. రాష్ట్రాలవారీగా కులాల లిస్టులను తయారుచేసి వాటికి కోడ్ నెంబర్ ఇచ్చి పేపర్ ప్రకటనలు ఇవ్వాలి. ప్రజల నుంచి అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించాలి. తర్వాత తుది లిస్టును ప్రకటించాలి. తద్వారా పారదర్శకత పెరిగి కులాల లెక్కలు కరెక్ట్ గా వస్తాయి. కుల గణనకు సార్థకత వస్తుంది. అలాగే ముస్లిం, క్రిస్టియన్ మతంలోని కులాల క్రోడీకరణ జరగాలి. ఐదవది ప్రస్తుతమున్న సెన్సెస్ ఫారం లో కాలం నెంబర్ 8 లో కులాల వివరాలు తెలియపరచవలసి ఉంటుంది. కాలం నెంబర్ 8లో ఎస్సీ అయితే ఎస్సీ అని టిక్ చేసి కింద 8A లొ ఏ కులమో తెలియచేయాలి. అదేవిధంగా ఎస్టి అయితే ఎస్టీ అని టిక్ చేసి క్రింద 8B లొ తెగ వివరాలు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ బిసి లేదా ఓబీసీ అనే కాలం సృష్టించాలి, దాని క్రింద బీసీ మరియు ఓబీసీ అనే కాలంలు ఉండాలి. ఎందుకంటే ఉదాహరణకు తెలంగాణలో 134 కులాలు బీసీ లిస్టులో ఉన్నాయి, కాని కేంద్ర ఓబీసీ లిస్టులో 86 కులాలు మాత్రమే ఉన్నాయి. మరి అక్కడ వ్యక్తి ఏ విధంగా సమాధానం ఇవ్వాలి అని ప్రశ్న ఉద్భవిస్తుంది. రాజ్యాంగ రీత్యా
ఆర్టికల్ 342A1 ప్రకారం కేంద్రం తన స్వంత ఓబీసీ లిస్ట్ ను కలిగి ఉండవచ్చును. అదేవిధంగా రాష్ట్రలు ఆర్టికల్ 342A3 ప్రకారం తమ స్వంత లిస్ట్స్ కలిగి వుండవచ్చును.
అందువలన ఈ రెండు కాలమ్స్ ఉండటం శ్రేయస్కరం. అయితే మొదట ఈ లిస్ట్లు పత్రికలలో ప్రకటించాలి. అలాగే ఓసీ కాలమ్ కూడా సృష్టించాలి.అక్కడ కూడ క్రింద కులాల లిస్ట్ కోడ్ నంబర్స్ తో ఉండాలి. ముస్లిం, క్రిస్టియన్ ఇతర మతాలకు కూడా కాలంలు సృష్టించాలి. వారి కులాలను కూడా క్రోడీకరించి కోడ్ నంబర్స్ ఇవ్వాలి. ఆరవది ప్రస్తుత సెన్సస్ ఫార్మేట్ లో 29 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో ఆర్థికపరమైనటువంటి డాటా పెద్దగా సేకరించడం లేదు. మరి కేవలం కులం డాటా సేకరించి భూమి, ఆర్ధిక డాటా సేకరించకపోయినట్టయితే బీసీల సామాజిక, ఆర్ధిక వెనుకబాడుతనమనేది తేట తెల్లం కాదు. కాబట్టి సెన్సెస్ కాలమ్స్ ను కొన్ని పెంచాలి. అప్పుడు సమగ్ర సమాచారాన్ని సేకరించిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఆధార్ కార్డ్,రేషన్ కార్డ్,ఓటర్ ఐడి కార్డ్స్ సమాచారాన్ని సేకరించాలి. ఏ ఏ కాలంలను కలపాలనే దానిపైన ప్రజాభిప్రాయాన్ని కూడా స్వీకరించాలి. ఏడవది ఈ సెన్సస్ ను జాతీయ జనాభా రిజిస్టర్ కు లింక్ చేయకుండా ఉంటే మంచిది. లేనట్టయితే అనవసర రాజకీయాలకు దారితీసి డాటా సమగ్రతను దెబ్బ తీసే అవకాశం కలదు. ఎనిమిదవది సెన్సెస్ లో డాటా సేకరణ డిజిటల్ అదే విధంగా మాన్యువల్ గా కూడాజరగాలి. ఎందుకంటే కొండ ప్రాంతాలలో సెల్ ఫోన్ సిగ్నల్స్ తక్కువ కాబట్టి మాన్యువల్ సెన్సస్ ఉపయుక్తం గా ఉంటుంది. తొమ్మిదవది సేకరించిన సమాచారం చాలా గోప్యంగా, భద్రంగా ఉంచాల్సినటువంటి అవసరం గలదు. అది వ్యక్తి ప్రైవసికి భంగం కలగకుండ భద్రపరచాలి. డేటా సెక్యూరిటీకి కావలసిన అన్ని చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే ఈ డాటా పైన ప్రజల విశ్వాసం సన్నగిల్లి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ డాటాలో మార్పులు చేర్పులు చేసి కావలసిన వారి కులాల జనసంఖ్య పెంచినారనని విమర్శ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మాన్యువల్ డాటా ఎంట్రీ లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
పదోది సెన్సస్ అనేది సెన్సెస్ ఆఫ్ ఇండియా ఆక్ట్ 1948 ద్వారా జరుగుతుంది. ఇప్పుడు అన్ని మతాలలోని కులాల జన గణన జరుగుతుంది కాబట్టి ఆ సెన్సెస్ చట్టాన్ని కూడా అవసరమైన మేరకు సవరించాల్సిన అవసరం ఉంటే సవరించలి. అదేవిధంగా ఒక స్వతంత్ర సెన్సెస్ కమిషన్ వేసి ప్రజాభిప్రాయాన్ని సేకరించి తద్వారా ఫార్మేట్స్ ను రూపొందించి సెన్సెస్ చట్టములో కూడా కావాల్సిన మార్పులు,చేర్పులు చేసి ఈ కుల గణను చేసినట్లయితే మంచి ఫలితాలు రాగలవు. పదకొండవది భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం చేపట్టే అన్ని సర్వేలలో ఉదాహరణ కు NSS, NFHW, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేపట్టే వ్యవసాయ సర్వే మొ,,వాటిలో కూడా ఓబీసీ కాలమ్స్ చేర్చి వివరాలు సేకరించాలి. పన్నెడోవది కేంద్ర ప్రభుత్వము తొందరగా షెడ్యూల్ ప్రకటించి మొదలే తగు ప్రచారాన్ని కల్పించాలి. కావాల్సిన బడ్జెట్, ఇతర ఏర్పాట్లు చేయాలి. ప్రజలను సమాయత్త పరచాలి. ప్రజలు కూడా సహకరించాలి,సెన్సస్ లో భాగస్వామ్యులు కావాలి. కులమనేది భారత దేశంలో ఒక వాస్తవికత. కులం ఎక్కడ ఉందో అక్కడ వివక్షత కూడా ఉంటుంది.అణచి వేత ఉంటుంది. అందుకే ఈ కుల గణన అనేది ఒక రోగ నిర్ధారణ పరికరం. రోగం సరిగా నిర్ధారించ బడితే చికిత్స సులభం. ఈ జనగణనలో కుల గణన ద్వారా భారతదేశం నేడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం కనుక్కోవచ్చు. ముఖ్యంగా ఓబీసీ రిజర్వేషన్స్ ను సమీక్షించ వచ్చును. ఓబీసీ ఉప వర్గీకరణ సులభతరమవుతుంది. జనాభా లెక్కల ఆధారంగా న్యాయ స్థానములకు కావాల్సిన, నిరూపించగల (Empirical) లెక్కించగల, (quantifiable) సమగ్ర సమాచారాన్ని అందించే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా ఒక లాజికల్ ముగింపుకు తీసుకువచ్చే అవకాశం కలదు. అదేవిధంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో జరిగినటువంటి కుల సర్వేలో ఉన్నటువంటి లోపాలను కూడా సరిదిద్దవచ్చును.
భారతదేశం నేడు ప్రపంచములో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానీ మానవ అభివృద్ధి సూచికలో 130 వ ర్యాంకు కలిగినటువంటి దేశం. అందుకే ఈ కులగణన ద్వారా సామాజిక, ఆర్ధిక, అవసరమైతే రాజకీయ అంశాలను లెక్కించి రాబోయే కాలంలో తగు విధాన నిర్ణయాలు, ప్రణాళికలు రచించి మానవాభివృద్ధి సూచికలలో ముఖ్యంగా విద్యా, ఆరోగ్యములో మన స్థానాన్ని మెరుగు పర్చుకోవచ్చును. ఈ దేశ సంపద, ఉత్పత్తి, పంపిణీలను తగువిధాన నిర్ణయాలతో సరి చేయవచ్చును. తద్వారా సామాజిక న్యాయం సమ్మిళిత అభివృద్ధి సాధ్యమైతుంది. అసమానతలు తగ్గి అగ్ర రాజ్యంగా మారుతుంది. సమగ్ర కుల గణనే భారత దేశానికి దిక్సూచి అవుతుంది. వెనుకబాటుతనము ముందుగా గుర్తించకపొతే దాన్ని పరిష్కరించ లేము. దాని కోసం కులాన్ని లెక్కించాలి.