భారీ ఆర్థిక ఎజెండ..!
– పలు బిల్లులకు సవరణలు?
– పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సభ ముందుకు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 3 (అఖండ భూమి న్యూస్)
రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు భారీ ఆర్థిక ఎజెండాకు వేదిక కానున్నాయి. ఇందులో పలు కీలక బిల్లులను తీసుకురావటానికి కేంద్రం సిద్ధమవుతున్నది. దీనికి ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులకు ఊతమివ్వటం, విలువ సృష్టిని ప్రోత్సహించే లక్ష్యంగా ఈ ఆర్థిక ఎజెండా ఉండనున్నట్టు సమాచారం. పలు బిల్లులకు సవరణలు ఉండనున్నట్టు తెలుస్తున్నది. ఇందులో ది ఇన్సూరెన్స్ (సవరణ) బిల్లు, దివాలా మరియు దివాలా కోడ్ (ఐబీసీ), 2016లను పరిశీలన, ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. వీటితో పాటు కొత్త సరళీకృత ఆదాయపు పన్ను బిల్లుపై పార్లమెంట్ సెలక్ట్ కమిటీ నివేదికను సమర్పించటాన్నిబట్టి.. ఆ చట్టాన్ని కూడా అదే సమావేశంలో ఆమోదించే అవకాశం ఉన్నదని వివరిస్తున్నాయి.
బీమా బిల్లు డివిడెండ్‌లను స్వదేశానికి తరలించటం, విదేశీ యాజమాన్యంలోని బీమా సంస్థల కీలక నిర్వహణ సిబ్బంది నియామకంపై ప్రస్తుత మార్గదర్శకాలు, షరతులను కూడా సడలించటంలో కీలకం కానున్నది. ఈ బిల్లు.. బీమా చట్టం, బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ చట్టం, ఎల్‌ఐసీ చట్టాలను సవరిస్తుంది. ఎస్‌ఐసీ చట్టానికి చేసిన సవరణ ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థలకు సిబ్బంది నియామకం, శాఖ కార్యాలయాల ప్రారంభంపై పూర్తి స్వేచ్ఛను ఇవ్వటం ద్వారా వారికి మరింత స్వయంప్రతిపత్తిని ఇవ్వటం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇక ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. ఈ ముసాయిదా చట్టాన్ని బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని లోక్‌సభ సెలక్ట్ కమిటీకి పంపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటి రోజున కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ప్యానెల్ దీనిని సమర్పిస్తే.. బిల్లును ఈ సెషన్‌లోనే తీసుకోవచ్చని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అయితే, వీటితో పాటు ఇప్పటి వరకు చర్చలోకి రాని, బీజేపీ కోర్ ఎజెండాలో భాగంగా ఉన్న కీలకమైన ఇతర ఏవైనా బిల్లులను మోడీ సర్కారు ఈ సమావేశాల్లో తీసుకువచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. రానున్న బీహార్ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశాల పనితీరు కూడా ఉండొచ్చని అంటున్నారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



