రిలీవ్ చేయడం లేదని మనస్థాపానికి గురై ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నం
-ఆర్టీసీ నిజామాబాద్-2 డిపోకు చెందిన షేక్ ఇమామ్ సాహెబ్..
-ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాహెబ్..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ జూలై 10: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్, నిజామాబాద్ ఆర్టీసీ-2 డిపోకు చెందిన షేక్ ఇమామ్ సాహెబ్ ఖమ్మం డిపోకు బదిలీ అయిన ఆర్టీసీ అధికారులు రిలీవ్ చేయడం లేదని మనస్థాపానికి గురై గురువారం ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా సత్తుపల్లి గ్రామానికి చెందిన షేక్ ఇమామ్ సాహెబ్ ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ గా చేస్తుండేవాడు. మూడు సంవత్సరాల క్రితం ఆర్టీసీ ఈ డి ఖమ్మం జిల్లా నుండి ఆరు నెలల కోసమని నిజామాబాద్ జిల్లాకు బదిలీపై పంపారు. నిజామాబాద్-2 డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా ఆరు నెలలుగా పని చేస్తున్నాడు. ఆరు నెలలైనా సొంత జిల్లా ఖమ్మం కు బదిలీ చేయాలని అధికారులకు విన్నవించిన రిలీవ్ చేయలేదు. గత మూడు సంవత్సరాలుగా నిజామాబాద్-2 డిపోలో డ్రైవర్ గా చేస్తూనే ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం ఇమామ్ సాహెబ్ కు ఖమ్మం కు బదిలీ అయింది. రిలీవ్ చేయాలని ఆర్టీసీ అధికారులకు అనేకసార్లు ప్రాధేయపడిన రిలీవ్ చేయలేదు. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను వదిలి నిజామాబాదులో మూడేళ్లుగా పనిచేస్తూ ఇబ్బంది పడుతున్నాడు. గురువారం నిజామాబాద్ నుండి నిర్మల్ కు డ్యూటీ చేస్తూ మధ్యలో ఆర్మూర్ బస్టాండ్ లో బస్సును ప్లాట్ ఫామ్ పై ఉంచాడు. బదిలీ అయిన ఆర్టీసీ అధికారులు రిలీవ్ చేయడం లేదని ఆర్మూర్ బస్టాండ్ ఆవరణలో మనస్థాపానికి గురై 8 ప్యాకెట్ల ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఎలుకల మందు పడిపోవడంతో ఇది గమనించిన ఆర్టీసీ కార్మికులు చికిత్స కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.