రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ నిధుల జమను అధికారులు విజయవంతం చేయాలి

— జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్
రాజమహేంద్రవరం; అఖండ భూమి;
రైతుల ఖాతాల్లోకి ఈ ఏడాది అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అధికారులు విజయవంతంగా అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా వై. మేఘా స్వరూప్ మాట్లాడుతూ బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో అర్హులైన 1,14,991 మంది రైతులకు మొత్తం ₹7,699.90 లక్షల నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది అన్నదాత సుఖీభవ–2వ విడత క్రింద రూ. 5,749.55 లక్షలు, పీఎం కిసాన్ 21వ విడత క్రింద ₹1,950.34 లక్షలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్న నేపథ్యంలో, కార్యక్రమం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమగ్రంగా నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో, అలాగే RSK కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం పాటించాలని తెలియజేశారు. జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామా నాయుడు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తదితరులు గోపాలపురం నియోజక వర్గం దేవరపల్లి మండలం గౌరిపట్నం ఆర్ ఎస్ కే పరిధిలో జరిగే కార్యక్రమం లో పాల్గొనడం జరుగుతుందనీ జేసి వై మేఘా స్వరూప్ తెలిపారు.
గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా అందుతున్న ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని, గ్రీవెన్సులను క్లోజ్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఎండోర్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద నూతన గృహాలు మంజూరు చేయడానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపీడీవోలు సర్వే చేసి గుర్తించాలని సూచించారు.
సర్వే, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి స్వామిత్వ సర్వేలో పురోగతి సాధించాల్సిందిగా, ప్రతి వారం సమీక్ష చేపడతామని తెలిపారు.
ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని అన్ని సంక్షేమ వసతి గృహాలను సందర్శించి మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, విద్యార్థుల వ్యక్తిగత శుభ్రత, భోజనం నాణ్యత, వార్డెన్ల అందుబాటు, మొత్తం సంక్షేమాన్ని సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
రోడ్లు–భవనాల అధికారులు సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను సందర్శించి భవనాల ఫిట్నెస్‌పై నివేదిక ఇవ్వాలని తెలిపారు. ప్రతి నెల ఒక రోజు వసతి గృహాల పరిసరాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.వో టి. సీతారామమూర్తి, ఎస్‌డీసీ ఎస్. భాస్కర్ రెడ్డి, డీపీఓ వి. శాంతమణి, డీడీఓ పి. వీణా దేవి, ఏడి సర్వే బి. లక్ష్మీనారాయణ, సీపీఓ ఎల్. అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.


