ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది దుర్మరణం….!!

*ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది దుర్మరణం….!!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 30 (అఖండ భూమి న్యూస్);

ఇండోనేషియా :- ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మనాడో నగరంలోని ఓ వృద్ధాశ్రమంలో జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది సజీవ దహనమయ్యారు. మరో 15 మందిని సురక్షితంగా కాపాడినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. వారిలో కొందరు స్వల్పంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. వెర్ధా దమై వృద్ధాశ్రమంలో ఈ ఘటన జరిగిందని స్థానిక మీడియా నివేదిక పేర్కొంది.

ఘటనా సమయంలో ఆశ్రమంలోని వృద్ధులంతా.. గాఢ నిద్రలో ఉన్నారని అందువల్లే భారీగా ప్రాణనష్టం వాటిల్లిందని మనాడో అగ్నిమాపక విభాగాధిపతి జిమ్మీ రొటిన్సులు తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో.. లోపలివారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. మొత్తం 16 మంది మృతుల్లో 10 మంది మహిళలూ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వీరందరి వయస్సులు 65 నుంచి 85 ఏళ్ల మధ్య ఉంటుందని ఆయన అన్నారు.

ప్రమాద సమయంలో ఉవ్వెత్తున ఎగిసిపడే మంటలను ఆర్పి వేసేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టిందని అక్కడి అధికారులు తెలిపారు. ఆ భవనంలోని వంటగదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. అయితే.. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఆ ఆశ్రమంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటించారా లేదా అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Akhand Bhoomi News

error: Content is protected !!