డిగ్రీ కళాశాల ఆస్తుల్లో మాది ఏ తప్పు లేదు…
– రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ డ్రామా : ఎమ్మెల్యే..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 23 (అఖండ భూమి న్యూస్);
రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల అంశాన్ని తెరపైకి తెచ్చారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, రెవెన్యూ అధికారులను కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో నిజాలు బయట పెట్టాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో తాను, తన తండ్రి ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఎమ్మెల్యే కేవీఆర్ అన్నారు. నిజాయితీగా ఉన్నవాళ్లకు భయం ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వంలో వాళ్లే ఉన్నారని, రెండు నిమిషాలలో డాక్యుమెంట్స్ తెప్పించే అధికారం ఉందన్నారు. అలాంటపుడు ఈ రచ్చ ఎందుకు.. గొడవ ఎందుకు అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. 2004 నుంచి 2009 వరకు మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ నాడు ఏమి చేయలేదని, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆయన సీఎం ద్వారా రికార్డులు తెప్పించుకోవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. దీనికి కచ్చితంగా ముగింపు పలుకుతానని తెలిపారు.
‘263 ఎకరాల్లో భూమిలో 1964 నుంచి ఇప్పటివరకు ఏ భవనానికి ఎంత స్థలం కేటాయించారు.. ప్రజా ప్రయోజనాల కోసం చేసారా.. స్వార్థ ప్రయోజనాల కోసం చేసారా అనేది నిగ్గు తేల్చాలని కలెక్టర్ను కోరాను’ అని ఎమ్మెల్యే తెలిపారు. కళాశాల ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా భూ సేకరణ చేయడం వల్లే కామారెడ్డిలో అన్ని రకాల ప్రభుత్వ భవనాలు, కళాశాలలు వచ్చాయని, లేకపోతే కామారెడ్డిలో ఏమి ఉండేవి కాదన్నారు. 2004-09 వరకు మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ తెలంగాణ యూనివర్సిటీని కామారెడ్డికి తెచ్చే దమ్ము, తెలివి లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఒక్క మండలానికి కూడా మోడల్ పాఠశాల తెలేదని విమర్శించారు.
తాను జెడ్పీ ఛైర్మన్గా ఉన్నప్పుడు సదాశివనగర్కు మోడల్ స్కూల్ తెచ్చానని కేవీఆర్ తెలిపారు. కర్షక్ బీఈడీ, ఇంజినీరింగ్ కళాశాల హైదరాబాద్ వెళ్లిపోతే ఏమి చేశాడని షబ్బీర్ను ప్రశ్నించారు. 8.20 ఎకరాల కళాశాల మైదానం దున్నితే దాని వెనకాల ఉన్నది ఎవరని నిలదీశారు. తెరవెనుక రాజకీయ శక్తులు లేకపోతే ఇతర ప్రాంతం వాళ్లు కళాశాల భూమిపై కన్ను ఎలా వేస్తారన్నారు. ఇప్పటికి కామారెడ్డిలో ఆరుగురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారని, తనను లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని ఇంట్లో ఉంచారని, కాంగ్రెస్ వాళ్లను మాత్రం ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. దీనిని బట్టి పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. తనకు ప్రాణభయం లేదని, రేపటి నుంచి ప్రాణభయం ఎలా ఉంటుందో వాళ్లకు చూపిస్తానని పేర్కొన్నారు. ఉండేది ఒకరోజు పోయేది ఒకరోజు.. పోయేముందు ఖచ్చితంగా తన వెంట 10 మందిని తీసుకెళ్తానని తెలిపారు.


