పోలీసు బదిలీల్లో పారదర్శకతకు పెద్దపీట…

– కౌన్సిలింగ్ ద్వారా 09 మంది హెడ్ కానిస్టేబుళ్లకు పోస్టింగ్‌లు..
– జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 16. (అఖండ భూమి న్యూస్) ;
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర, ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బదిలీల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించారు. కరీంనగర్ ,రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది కామారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చిన 09 మంది హెడ్ కానిస్టేబుళ్లకు కౌన్సిలింగ్ , సీనియారిటీ పద్ధతిలో పోస్టింగ్‌లను కేటాయించారు.
వారితో జిల్లా ఎస్పీ వివరంగా మాట్లాడి వారి ప్రాధాన్యతలను తెలుసుకుని, విల్లింగ్ స్టేషన్లు, జీవిత భాగస్వామి ఉద్యోగ స్థానం (స్పౌస్), సీనియారిటీ, ఆరోగ్య పరిస్థితులు ,సర్వీస్ రికార్డును పరిగణనలోకి తీసుకుని కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. అదేవిధంగా వారి పిల్లల విద్యాభ్యాసం గురించి కూడా ఆరా తీశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, పారదర్శకమైన బదిలీలు సిబ్బందిలో విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా బాధ్యతాయుత విధులకు బలమైన పునాదిగా నిలుస్తాయని అన్నారు. పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో విధులు నిర్వహిస్తూ ప్రజల్లో పోలీసు శాఖపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
పోలీసు అధికారిగా నైతిక విలువలు, సేవాభావం అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, విధుల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకుని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఎస్పీ దిశానిర్దేశం చేశారు. కొత్తగా పోస్టింగ్‌లు పొందిన హెడ్ కానిస్టేబుళ్లు తమ విధి ప్రాంతాల్లో అంకితభావంతో పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె. నరసింహారెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు , పరిపాలనా సిబ్బంది పాల్గొన్నారు.


