జర్నలిస్ట్ ల స్థలాల్లో మట్టి మాఫియా పై చర్యలు తీసుకోవాలి

మౌలిక సదుపాయాలు కల్పించి,ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలి

జగన్నాథ గట్టు జర్నలిస్ట్ స్థలాలను పరిశీలించిన సిపిఎం పార్టీ బృందం

కర్నూలు టౌన్, ఏప్రిల్ 12, (ఆఖండభూమి న్యూస్) :

జర్నలిస్టుల స్థలాల్లో అక్రమంగా మట్టి తరలిస్తున్న మట్టి మాఫియా పై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. బుధవారం జగన్నాథ గట్టు ప్రాంతంలోని జర్నలిస్ట్ లకు కేటాయించిన స్థలాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నిర్మల,కె.వి నారాయణ,నగర కార్యదర్శులు రాజశేఖర్, రాముడు,ఏపీడబ్ల్యుజెఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి చిన్న రామాంజనేయులు, నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివకుమార్,నాగేంద్ర పర్యటించి పరిశీలించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో జర్నలిస్టుల కోరిక మేరకు 2009లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జగన్నాథగట్టు మీద సర్వే నెంబర్ 478 లో 15 ఎకరాల 44 సెంట్లు భూమిని ది కర్నూల్ జర్నలిస్టు మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కేటాయించారు. ఇందుకుగాను జర్నలిస్టులు అప్పటి మార్కెట్ ధర ప్రకారం రూ.65 లక్షలు ప్రభుత్వానికి చెల్లించారు. ఆయా స్థలాల్లో అధికారులు ఇప్పటివరకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. అక్కడ విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో జర్నలిస్టులు ఇళ్లను నిర్మించుకోలేకపోయారన్నారు. ఇదే అదనుగా భావించిన ఎర్రమట్టి (గ్రావెల్) మాఫియా జగన్నాథ గట్టులో ఎలాంటి అనుమతులు లేకుండా ఎడాపెడా మట్టి తవ్వకాలు చేస్తున్నారన్నారు. చివరకు జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల్లో కూడా భారీగా తవ్వకాలు చేపట్టారు. రాత్రివేళలలో ప్రొక్లెయిన్లు పెట్టి తవ్వకాలు చేస్తున్నారు. దీంతో 20 అడుగుల మేర గోతులు ఏర్పడి, సుమారు 60 మంది జర్నలిస్టుల ప్లాట్లు రూపురేఖలు మారిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా లేకుండా పోయాయని అక్కడ ఇళ్లు కట్టుకోవాలంటే కూడా కట్టుకోలేని పరిస్థితి ఉందని నేటికీ జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల్లో యధేచ్చగా ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతూనే ఉ న్నాయన్నారు. దీనిపై జర్నలిస్టులు పలుమార్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని దాదాపు 1.70 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టి తవ్వకాలు అక్రమంగా జరిగినట్లు మైనింగ్ అధికారులు గుర్తించారన్నారు. మట్టి మాఫియా వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 9 కోట్ల మేర నష్టం జరిగిందనీ, తక్షణ చర్యలు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు కూడా మైనింగ్ అధికారులు రిపోర్ట్ లో పేర్కొన్నారని తేలిపారు. కాని ఇప్పటివరకు మట్టి తవ్వకాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ,అధికార పార్టీ కి చెందిన పాణ్యం,కొడుమురు ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. అందుకే అధికారులు ఆ మట్టి మాఫియా పై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారేమో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కావున ఇప్పటికైనా జిల్లా కలెక్టర్,ఎస్పీ, స్పందించి జగన్నాథగట్టుపై మట్టి తవ్వకాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని,రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రూ.9 కోట్లు అక్రమార్కుల నుండి రికవరీ చేయాన్నారు. జర్నలిస్టుల స్థలాల్లో అక్రమ తవ్వకాల వల్ల ఏర్పడిన గుంతలను పూడ్చివేయించి, జిల్లా సర్వేయర్ ద్వారా రీ సర్వే చేయించి హద్దులను ఏర్పాటు చేయించేందుకు తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యుజెఎఫ్ నాయకులు రమేష్,విజయ్ కుమార్,చెన్నయ్య,విజయ్ కరణ్,తదితరులు పాల్గొన్నారు.
admin1

Masapogu Eswaraiah... Akhanda Bhoomi.. Telugu Daily News.. Telugu Web News.. Edtior & Publisher.. Cell : 9441626873.