మే నెల జీతాల్లో 1.5 శాతం కోత అన్యాయం
– ఈహెచ్ఎస్ విధివిధానాలు ఖరారు కాకముందే వేతనాల్లో మినహాయింపులు సరికాదు
– టీఎస్ యూటీఎఫ్ జిల్లా కోశాధికారి రూప్ సింగ్
– కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 31 (అఖండ భూమి న్యూస్);
ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అమలుకు సంబంధించిన విధివిధానాలు పూర్తిగా ఖరారు కాకముందే ఉద్యోగుల మే నెల వేతనాల్లో 1.5 శాతం చందా పేరిట కోత విధించడం అన్యాయమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) కామారెడ్డి జిల్లా కోశాధికారి రూప్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఆరోగ్య పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఆస్పత్రులతో ఒప్పందాలు కుదరలేదని, చికిత్స ప్యాకేజీ రేట్లు నిర్ణయించలేదని, డిజిటల్ హెల్త్ కార్డులు కూడా జారీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈహెచ్ఎస్ చందాగా 1.5 శాతం మినహాయింపుపై ప్రభుత్వం ఎలాంటి జీవో జారీ చేయకపోయినా ఆర్థిక శాఖ అధికారులు అత్యుత్సాహంతో ఉద్యోగుల జీతాల నుంచి కోత విధించడం సమంజసం కాదన్నారు. విధివిధానాలపై ప్రశ్నించినప్పుడు ఆరోగ్య శాఖ నుంచి మార్గదర్శకాలు వస్తాయని చెప్పిన అధికారులు, అవి లేకుండానే వేతనాల్లో కోత విధించడం ఎలా న్యాయసమ్మతమవుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబ సభ్యుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ వెబ్‌సైట్‌లో నమోదు చేయడానికి గడువు విధించినప్పటికీ, చివరి వరకు సైట్‌లో మార్పులు కొనసాగాయని, పూర్తి వివరాలు నమోదు చేసే అవకాశం కూడా కల్పించలేదన్నారు. పాత నిబంధనల ప్రకారం భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఒక్కరి నుంచే చందా వసూలు చేసేవారని, ప్రస్తుతం ఇద్దరి జీతాల నుంచి కూడా మినహాయింపులు చేసినట్లు తెలిపారు. ఆధారిత కుటుంబ సభ్యుల అర్హతల విషయంలోనూ ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులు కూడా కొంత భాగస్వామ్యం వహించాలని ప్రభుత్వం కోరినప్పుడు ఉద్యోగ సంఘాలు సహకరించాయని గుర్తుచేశారు. అయితే వేతనంలో 1.5 శాతం కోత నిర్ణయం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ఉద్యోగుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసి ఆరోగ్య పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాల్సిన సమయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకుండా హడావుడిగా వేతనాల్లో కోత విధించడం పలు అనుమానాలకు తావిస్తోందని రూప్ సింగ్ పేర్కొన్నారు.
You may also like
కాకి వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు శంకుస్థాపన…
రక్తదానంతో మానవత్వాన్ని చాటుతున్న శ్రీహరి…
బాన్సువాడ డివిజన్లో శారీరక దివ్యాంగుల కోసం ప్రత్యేక యు డి ఐ డి (సదరం) క్యాంపు…
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష…
కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్…


