రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోంది
– కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 20 (అఖండ భూమి న్యూస్);
రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని మాజీ ప్రభుత్వ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా, పెట్టుబడి సాయం వంటి పథకాలపై పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా 71 లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నప్పటికీ కేవలం 11 విడతల్లో రూ.72 వేల కోట్లకుపైగా మాత్రమే విడుదల చేసి మిగతా రైతులను నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 11 విడతలుగా రైతు భరోసా నిధులను విడుదల చేసినా, రాష్ట్రంలోని అన్ని రైతులకు ప్రయోజనం చేకూరలేదని అన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి, ప్రస్తుతం రూ.12 వేలకే పరిమితం చేశారని విమర్శించారు. అలాగే రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందించకుండా కేవలం కొంతమందికే చెల్లింపులు జరపడం అన్యాయమని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, కేవలం ఏడు రకాల ధాన్యాలకే బోనస్ పరిమితం చేసి రైతులను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో సన్న రకం ధాన్యానికి 1.30 కోట్ల ఎకరాల్లో సాగు జరిగితే, కేవలం 2.31 కోట్ల ఎకరాలకే బోనస్ చెల్లించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఎన్నికల సమయంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో సుమారు 7,600 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని, మిగిలిన రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, రైతులను అరిగోస పెట్టడం వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతోందని గంప గోవర్ధన్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వంటి పథకాల ద్వారా రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, రైతులకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాసర్ల స్వామి, ప్రభాకర్ రెడ్డి, కో అప్షన్ సభ్యుడు కుంబాల రవి యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు ప్రభాకర్ యాదవ్, హఫీజ్ భేగ్, పిట్ల వేణు, గెరిగంటి లక్ష్మీనారాయణ, లోలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


