యోగా ఆరోగ్యకరమైన జీవన విధానానికి పునాది …
అదనపు కలెక్టర్
ఎన్.వి. గిరి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 21 (అఖండ భూమి న్యూస్);
యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వి. గిరి అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం కామారెడ్డి ఖేలో ఇండియా కేంద్రంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వారసత్వమని, ఇది శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమతుల్యతను నెలకొల్పుతుందని తెలిపారు. నేటి వేగవంతమైన జీవన విధానంలో ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, యువత, క్రీడాకారులు, ఆయుష్ శాఖ సిబ్బందితో కలిసి యోగాసనాలు నిర్వహించారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు, యువత, క్రీడాకారులు, ఆయుష్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
డా. వెంకటేశ్వర్లు (ఆయుష్ నోడల్ అధికారి, అదనపు డీఎంహెచ్‌ఓ), జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాజా గౌడ్, జిల్లా యువజన సేవల సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి వివిధ యోగాసనాలను ప్రదర్శించారు.
జిల్లా ప్రజలు యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి కోరారు.


