ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 22 (అఖండ భూమి న్యూస్);
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్)-2026 ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదు కావాలి : జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ” (స్పెషల్ ఇంటెసివ్ రివిజన్ సార్) 2026 కార్యక్రమంపై సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదు కావడం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 25, 2026 నుంచి జూలై 24, 2026 వరకు బూత్ స్థాయి అధికారులు (బి ఎల్ ఓ లు) ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు గణన పత్రాలు (ఇన్విటేషన్ ఆన్ ఫార్మాస్) పంపిణీ చేసి, ఓటర్ల వివరాలను సేకరిస్తారని తెలిపారు. ఓటర్లు గణన పత్రాలను పూర్తిగా నింపి సంబంధిత బీఎల్‌ఓలకు అందజేయడంతో పాటు తమ వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జూలై 31, 2026న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించబడుతుందని, అనంతరం అందిన అభ్యంతరాలు, దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి అక్టోబర్ 1, 2026న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు చురుకుగా పాల్గొని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా సహకరించాలని కలెక్టర్ కోరారు.
అలాగే, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు వీలైనంత త్వరగా బూత్ లెవల్ ఏజెంట్లను (బి ఎల్ ఏ ఎస్) నియమించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో ఎన్ వై గిరి, తహసీల్దార్ హిమబిందు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు.


