ఆటో రిక్షాల్లో విద్యార్థుల అధిక లోడింగ్‌పై ప్రత్యేక తనిఖీలు…

ఆటో రిక్షాల్లో విద్యార్థుల అధిక లోడింగ్‌పై ప్రత్యేక తనిఖీలు…

విద్యార్థుల భద్రతే లక్ష్యం – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 7 (అఖండ భూమి న్యూస్);

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా రవాణా అధికారి సూచనలతో పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆటో రిక్షాల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను తరలిస్తున్న వాహనాలపై జిల్లా రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

సహాయక మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు రఫీ, ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట్ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా అధిక సంఖ్యలో విద్యార్థులతో నడుస్తున్న పలు ఆటో రిక్షాలను గుర్తించి, మోటారు వాహనాల చట్టం ప్రకారం సంబంధిత వాహనాలపై జరిమానాలు విధించారు.

అనంతరం నాగిరెడ్డిపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపాల్ వెంకట రాంరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అధికారులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, సురక్షితమైన రవాణా సౌకర్యాలనే వినియోగించాలని, రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వెంకట రాంరెడ్డి మాట్లాడుతూ, తమ పిల్లలు ఏ విధమైన వాహనాల్లో పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారనే విషయంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

మరో కార్యక్రమంలో భాగంగా మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ శంకర్ నారాయణ బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్‌ను కలిసి, పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను నిర్ణీత సమయాలకు నడపడంతో పాటు అవసరమైన సేవలను అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై డిపో మేనేజర్ సానుకూలంగా స్పందిస్తూ, విద్యార్థుల ప్రయాణానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

జిల్లా రవాణా శాఖ విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోదని, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!