పార్లమెంట్‌లో వేడెక్కనున్న రాజకీయ వాతావరణం…
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై కేంద్రం దృష్టి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 19 (అఖండ భూమి న్యూస్);
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. కీలక బిల్లుల ఆమోదమే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం వ్యూహరచన చేస్తుండగా, పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్)కు సంబంధించిన కీలక బిల్లులు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. కీలక బిల్లుల ఆమోదానికి అవసరమైన వ్యూహంపై ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ సమావేశాలను సజావుగా నిర్వహించడం, చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
మరోవైపు నీట్ పరీక్ష, అయోధ్య విరాళాల అంశాలతో పాటు ఇతర ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ అంశాలపై విస్తృత చర్చకు విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉండటంతో సమావేశాలు వాడివేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు, విపక్షాలు లేవనెత్తే అంశాలు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసే అవకాశం ఉంది.


