మానవ అక్రమ రవాణాపై యువత అప్రమత్తంగా ఉండాలి…
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఐ. ప్రసన్న..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 30 (అఖండ భూమి న్యూస్)
మిషన్ శక్తి పథకం కింద ఆర్‌కే డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి ఐ. ప్రసన్న,
జిల్లా మహిళా సాధికారత కేంద్రం, సఖి కేంద్రం సంయుక్తంగా మిషన్ శక్తి పథకంలో భాగంగా గురువారం కామారెడ్డి పట్టణంలోని ఆర్‌కే డిగ్రీ కళాశాలలో మానవ అక్రమ రవాణా అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఐ. ప్రసన్న మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణా సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారుతోందని అన్నారు. అక్రమ రవాణా ఎలా జరుగుతుంది, దానికి దారితీసే ప్రధాన కారణాలు ఏమిటి, యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని విద్యార్థులకు వివరించారు.
మాదకద్రవ్యాల వినియోగం, సెల్‌ఫోన్ వ్యసనం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణతో కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ తరఫున పాల్గొన్న న్యాయవాది కె. సిద్ధిరాములు మాట్లాడుతూ. విద్యార్థులకు న్యాయపరమైన హక్కులు, మౌలిక హక్కులు, మహిళలు , పిల్లల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు.
అనంతరం కళాజాత బృందం పాటలు, ప్రదర్శనల ద్వారా మానవ అక్రమ రవాణా నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత వంటి అంశాలపై విద్యార్థులను చైతన్యపరిచింది.
కార్యక్రమంలో ఆర్‌కే డిగ్రీ కళాశాల సీఈవో జైపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ నవీన్, అమృత దత్తహరి, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


