భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి …

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి …

– జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 04 (అఖండ భూమి న్యూస్);

 

జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల పరిస్థితుల దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వర్షాల పరిస్థితి, చెరువులు, వాగులు, రహదారులు, వంతెనలు, పాత భవనాలు, లోతట్టు ప్రాంతాల పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని చెరువులు, వాగులు, కాలువలు, నీటి ప్రవాహాల వద్దకు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదని సూచించారు. ముఖ్యంగా యువత, పిల్లలు సెల్ఫీలు తీసుకోవడం, ఈత కొట్టడం లేదా ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని దాటేందుకు ప్రయత్నించడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అప్రమత్తంగా ఉంచి, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా పర్యవేక్షించాలని కోరారు.

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న లింగంపేట మండలం లింగంపల్లి గ్రామ సమీపంలోని కేకేవై రహదారిపై కిలోమీటర్ 121/2-4 వద్ద చేపట్టిన పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. సంబంధిత శాఖలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో ఆ మార్గంలో రాకపోకలు పునరుద్ధరించబడినట్లు పేర్కొన్నారు.

జిల్లాలోని చెరువుల కట్టలు, వంతెనలు, కల్వర్టులు, రహదారులు, పాత భవనాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు తలెత్తిన వెంటనే రక్షణ చర్యలు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండి పొంగిపొర్లుతున్నందున, చెరువు పరివాహక ప్రాంతాలతో పాటు జీఆర్ కాలనీ ప్రజలు మరియు సమీప వార్డుల నివాసితులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అవసరం లేకుండా చెరువు పరిసర ప్రాంతాలకు వెళ్లవద్దని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

జిల్లాలో వర్షాల కారణంగా జరిగిన నష్టాలను కూడా సమీక్షించారు. ఇప్పటివరకు మొత్తం 171 గృహాలు దెబ్బతినగా, వాటిలో 167 గృహాలు పాక్షికంగా, 4 గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా 4 చెరువులు దెబ్బతినగా, 32 రహదారులు వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్నట్లు అధికారులు నివేదించారు. నష్టపరిహార అంచనా, పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి, డిప్యూటీ శిక్షణ కలెక్టర్ రవితేజ, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, ఆర్ అండ్ బి ఈఈ రమేష్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!