శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…

శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…

– జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 05 (అఖండ భూమి న్యూస్);

జిల్లాలో స్వచ్ఛత, పారిశుధ్యాన్ని ప్రజల భాగస్వామ్యంతో మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఇటీవల బూరుగుపల్లి గ్రామాన్ని సందర్శించి పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించిన సందర్భంగా ఇచ్చిన సూచనలు, ప్రోత్సాహంతో గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి వినూత్న కార్యక్రమాలను చేపట్టి శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో ఆదర్శంగా నిలిచారని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలోనే తొలిసారిగా, రాష్ట్రంలోనూ అరుదైన కార్యక్రమంగా బూరుగుపల్లి గ్రామంలోని ప్రతి ఇంటికి నాలుగు రంగుల చెత్త బుట్టలను పంపిణీ చేసి వ్యర్థాలను మూలస్థాయిలోనే వర్గీకరించే విధానాన్ని అమలు చేయడం అభినందనీయమని అన్నారు.

వ్యర్థాల వర్గీకరణను ప్రతి కుటుంబం తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆకుపచ్చ రంగు బుట్టలో తడి వ్యర్థాలు, నీలం రంగు బుట్టలో పొడి వ్యర్థాలు, ఎరుపు రంగు బుట్టలో శానిటరీ వ్యర్థాలు, నలుపు రంగు బుట్టలో ప్రమాదకర వ్యర్థాలను వేయడం ద్వారా శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ సులభతరం అవుతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా గ్రామ పరిశుభ్రత మెరుగుపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి, వ్యర్థాల వర్గీకరణ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు తమ ఇళ్లలో తల్లిదండ్రులకు కూడా ఈ అలవాటును నేర్పించాలని సూచించారు.

విద్యార్థులు సులభంగా గుర్తుంచుకునేలా అధికారులు ఈ నినాదాన్ని వివరించారు:

ఆకుపచ్చ – తడి చెత్తకునీలం – పొడి చెత్తకుఎరుపు – శానిటరీ చెత్తకునలుపు – ప్రమాదకర చెత్తకు

గ్రామ ప్రజలు తప్పనిసరిగా వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి గ్రామ పంచాయతీకి అందించాలని, నిబంధనలు పాటించని వారిపై గ్రామ పంచాయతీ చట్టాల ప్రకారం చర్యలు, జరిమానాలు విధించబడతాయని అధికారులు తెలిపారు.

ఈ అవగాహన కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీఓ, ఎంపీపీఎస్ ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ సూచనలు, ప్రోత్సాహంతో గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం బూరుగుపల్లిని శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగుగా నిలుస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలందరూ భాగస్వాములై గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

Akhand Bhoomi News

error: Content is protected !!