కోర్టులో నిందితులకు జైలు శిక్ష విధించింది నప్పుడే
బాధితులకు సరైన న్యాయం జరిగినట్లు
ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్
బాపట్ల జిల్లా పోలీస్ అధికారులతో వర్చువల్ విధానములో నేర సమీక్షా సమావేశం
- గంజాయి విక్రయాలను సమూలంగా అరికట్టడానికి పటిష్ట చర్యలు
బాపట్ల జిల్లా క్రైమ్ బ్యూరో, ఏప్రిల్ 27 (అఖండ భూమి) :
కోర్టులో నిందితులకు జైలు శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకున్నప్పుడే బాధితులకు సరైన న్యాయం చేసినట్లు అవుతుందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులకు తెలిపారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో
గురువారం వర్చువల్ విధానములో జిల్లా పోలీస్ అధికారులతో నేరసమిక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులలో ముద్దాయిల అరెస్ట్ ల గురించి, పీడీ చట్టం అమలు ప్రాపర్టీ కేసుల సర్కిల్ వారీగా ఏర్పాటు చేసిన క్రైమ్ పార్టీల పనితీరు గురించి, రోడ్డు ప్రమాదాల గురించి, కోర్ట్ లలో ట్రయిల్ జరుగుతున్న కేసుల గురించి, విచారణ దశలో వున్న 174 CrPC కేసుల గురించి, బాలబాలికల, మహిళల మిస్సింగ్ కేసుల గురించి, సిసి కెమెరాల ఏర్పాటు గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల గురించి సమీక్షించారు.
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిస్థాయిలో అరికట్టడానికి తగిన పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి విక్రయించే వారు ఎక్కువగా శ్రామికులను, యువతను లక్ష్యంగా చేసుకొని విక్రయిస్తూ ఉంటారన్నారు. గతంలో గంజాయి విక్రయించిన ప్రాంతాలపై, వ్యక్తులపై పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ లు నిఘా ఉంచాలన్నారు. గంజాయి సంబంధిత కేసులలో ఎవరైనా ఒక ముద్దాయి పట్టుపడితే అతడిని పూర్తిస్థాయిలో విచారించి గంజాయి సరఫరా ఎక్కడి నుంచి వస్తుందో, చివరిగా ఎవరు వినియోగిస్తున్నారో వారి పూర్తి వివరాలను తెలుసుకొని వారిని అరెస్ట్ చేసి వారందరిపై కఠినమైన శిక్ష పడేలాగా కేసులు నమోదు చేసి, గంజాయి విక్రయాలను సమూలంగా అరికట్టాలని ఆదేశించారు.
సర్కిల్ వారీగా ఏర్పాటు చేసిన క్రైమ్ పార్టీలు జైలు నుండి విడుదలైన పాత నేరస్థులపై నిఘా ఉంచాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. ఏదైనా దొంగతనం జరిగిన వెంటనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, నేరస్థుడు వదిలిన సాక్షాదారాలు, సిసి కెమెరాల ఫుటేజీలను క్రోడీకరించి ముద్దాయిలను పట్టుకొని, వారి వద్ద నుండి పూర్తిమొత్తంలో దొంగిలించిబడిన సొమ్ము రికవరీ చేయాలన్నారు.
కోర్టులో ట్రైల్ కు వచ్చిన కేసులను స్టేషన్ ఎస్.హెచ్.ఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలన్నారు. కోర్టు వాయిదాలకు సాక్షులు సక్రమంగా హాజరవుతున్నారా లేదా, వారిని ఎవరైనా ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉన్నదా అను సమాచారాన్ని కోర్ట్ కానిస్టేబుల్ ద్వారా తెలుసుకుని, సాక్షులు నిర్భయంగా జరిగిన వాస్తవాన్ని న్యాయమూర్తి ఎదుట ధైర్యంగా చెప్పే విధంగా తర్ఫీదు ఇవ్వాలన్నారు. స్టేషన్ లో కేసులు కట్టి ముద్దాయిని అరెస్ట్ చేసినందుకు మాత్రాన బాధితులకు న్యాయం జరిగినట్లు భావించకూడదని, ఎప్పుడైతే ముద్దాయిపై మోపబడిన నేరాన్ని సరైన సాక్షాదారులతో కోర్టులో రుజువు చేసి ముద్దాయికి జైలు శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటామో అప్పుడే, బాధితులకు సరైన న్యాయం చేసినట్లు అవుతుందన్నారు.
విచారణ దశలో వున్న 174 CrPC కేసుల విచారణ వేగవంతం చేయాలన్నారు. ఏదైనా కేసులో మృతుల యొక్క వివరాలు తెలియనప్పుడు ప్రస్తుతం వున్న సాంకేతిక పరిజ్ఞముతో ఇతర స్టేషన్ పరిధిలోని మిస్సింగ్ కేసులతో పోల్చి చూసుకోవాలని, వాట్స్ యాప్, ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియాలలో సమాచారాన్ని పోస్ట్ చేస్తే మృతుని వివరాలు త్వరగా తెలిసే అవకాశం ఉంటుందన్నారు.
మహిళలు, బాలికలు, చిన్నారులు అదృశ్యం అయినట్లు పిర్యాదు అందిన వెంటనే ఏ విధమైన అలసత్వం చూపించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిస్సింగ్ కేసులలో నిర్లక్ష్యం వహించవద్దని, ఫిర్యాదు అందిన వెంటనే ఒక టీంను ఏర్పాటు చేసుకుని దర్యాప్తు చేయాలని వీలైనంత త్వరగా కేసును చేధించాలని అధికారులకు సూచించారు.
బీట్ లను సమర్థవంతంగా నిర్వహించగలిగినప్పుడే నేరాలను కట్టడి చేయగలమన్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో రాత్రి, పగలు గస్తిలు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పగలు గస్తీ నిర్వహించే సిబ్బంది బ్యాంకులు, ఏటీఎం సెంటర్ లు, బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ ల వద్ద జేబు దొంగతనాలు, దృష్టి మరల్చి చేసే నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదే విధంగా కళాశాలలు, పాఠశాల వదిలే సమయానికి ఆ ప్రదేశాలకు చేరుకునే మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు గ్రామ పర్యటనలు చేస్తూ గ్రామాలలోని సమాచారాన్ని సేకరించి స్టేషన్ ఎస్.హెచ్.ఓ గారికి అందజేయాలన్నారు.
రాత్రిపూట గస్తీ నిర్వహించే సిబ్బందికి సంబంధిత స్టేషన్ ఎస్.హెచ్.ఓ బ్రీఫింగ్ నిర్వహించి పంపాలన్నారు. ప్రతి బీట్ కానిస్టేబుల్ రాత్రిపూట గస్తీ తిరిగే సమయంలో ఎవరైనా అనుమానితులు తారాసిపడితే వారిని విచారించి వారి పూర్తి వివరాలు సేకరించి, ఏదైనా అనుమానం కలిగిన ఎడల వారి యొక్క వేలిముద్రలను ఫింగర్ ప్రింట్స్ డివైస్ సహాయంతో సేకరించి అతనిపై గతంలో ఎక్కడైనా కేసులు ఉన్నాయా లేదా అని వెరిఫై చేసుకోవాలన్నారు.
విచారణ దశలో ఉన్న కేసులను సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకొని వేగవంతం దర్యాప్తు చేసి కేసును ఛేదించి సంబంధిత కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు చెయ్యాలన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. కనుక బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలన్నారు.
ఈ సమావేశంలో బాపట్ల అడిషనల్ ఎస్పీ పి.మహేష్ డి.సి.ఆర్.బి డి.ఎస్.పి జి. లక్ష్మయ్య బాపట్ల డి.ఎస్.పి ఏ.శ్రీనివాస్ రావు చీరాల డి.ఎస్.పి పి.శ్రీకాంత్ రేపల్లె డి.ఎస్.పి టి.మురళీకృష్ణ డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ పి.మురళీకృష్ణ జిల్లా లోని సి.ఐ అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్.ఐ లు. తదితరులు పాల్గొన్నారు



