అబద్ధాలతో ప్రజలని మభ్యపెడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం…
టీడీపీ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ వెబ్ న్యూస్ : –
విశాఖపట్నం, అఖండభూమి జూన్ 4: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలాడుతూ ప్రజలని మభ్యపెడుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి విమర్శించారు.
ఆదివారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలసోర్ రైలు దుర్ఘటన బాధాకరమని తమ పార్టీ తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. కవచ్ వ్యవస్ధ పని చేయకపోవడం విచారకరమని బాధను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపిలో ఏరువాక మొదలవుతోన్న సమయంలొ కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పని ముట్లు అందకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్బీకేల్లో పనిముట్లే లేవని, కానీ లేనిపోని ఆర్భాటాలకు జగన్ ప్రభుత్వం పూనుకుంటుందన్నారు. ప్రతి రైతు రూ.2,45,500ల సగటు అప్పుల్లో కూరుకు పోయారని,
కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపి రెండో స్ధానంలో వుంది అని తెలిపారు. రూ.13,500లను రైతుభరోసా కింద ఇస్తామన్నారని ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో రైతులకు ఏడాదికి రూ.1 లక్షా 15 వేలు వచ్చేటట్లు చేశారని గుర్తు చేశారు. నాలుగేళ్లలో 9 తుపానులు వచ్చి 54 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని, నష్టపరిహారం చెల్లించడానికి లేనిపోని సాకులు చూపి రైతులకు జగన్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.
పోలవరం 2022 కి పూర్తి చేస్తామన్నారని,
ఏ మేరకు పని చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలవరాన్ని ఏటిఎమ్ లా ఉపయోగించుకుని కేంద్రం నుంచి నిధులు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు.
పోలవరం నిర్మాణానికి
35 వేల కోట్లు రావాల్సి వుంటే
10 వేల కోట్లు ఇస్తే జగన్ ప్రభుత్వం సరిపెట్టుకొని చోద్యం చూస్తుందని ఎద్దేవా చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, 28 వేల ట్రాక్టర్లు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎవరికిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 25 టిఎమ్సీల నీరు ఉత్తరాంధ్రకు అవసరమైతే ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు ఇటువంటి ప్రభుత్వం ప్రజలకు ఏమి మేలు చేస్తుందని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎం వి వి ప్రసాద్, పోర్టు ట్రస్ట్ మాజీ సభ్యులు గొంపా సత్యనారాయణ పాల్గొన్నారు.



