Viveka Murder Case: వివేకా హత్య గురించి జగన్‌కు ముందే తెలుసు: సునీత
దిల్లీ: కడప ఎంపీ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది..
తెలంగాణ హైకోర్టు (TS High Court) మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మాజీ మంత్రి వివేకా (Viveka Murder Case) కుమార్తె సునీతా నర్రెడ్డి (Suneetha Narreddy) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ సందర్భంగా సునీత స్వయంగా వాదనలు వినిపిస్తూ పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ (CBI) సేకరించిన సాక్ష్యాలు, అనేక అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇదే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు..
”సీబీఐ దర్యాప్తునకు అవినాష్‌రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదు. ఏప్రిల్ 24 తర్వాత 3 సార్లు నోటీసులిచ్చినా విచారణకు ఆయన హాజరుకాలేదు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపారు. అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు వెళ్లినా ఎంపీ మద్దతుదారులు వారిని అడ్డుకున్నారు. సాక్షులను ఎంపీ అదే పనిగా బెదిరిస్తూ.. ఇతర నిందితులతో కలిసి వారిని ప్రభావితం చేస్తున్నారు. అవినాష్‌కు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తోంది. ఆయనకు అధికార పార్టీలోని కీలక వ్యక్తుల మద్దతు ఉంది. సీబీఐ అధికారులపై అవినాష్ తప్పుడు ఫిర్యాదులు చేశారు.. వారిపై ప్రైవేట్ కేసులు నమోదు చేయించారు. వివేకా హత్య గురించి సీఎం జగన్(YS Jagan)కు ముందే తెలిసింది” అని సునీత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సునీత వాదనల అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది..