Pawan Kalyan: ‘వారాహి’ కష్టం వృథా కాదు.. వచ్చే ఎన్నికల్లో బలమైన ముద్ర..
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తొలి విడత వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన జనసేనాని..
రెండో విడత వారాహి యాత్రకు సిద్ధం అవుతున్నారు.. ఇక, ఈ రోజు వారాహి యాత్ర కమిటీలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.. మొదటి విడత వారాహి యాత్ర జరిగిన విధానంపై సమీక్ష జరిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారాహి యాత్ర కోసం పడిన కష్టం వృథా కాదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బలమైన ముద్ర వేస్తుందన్నారు. ప్రజాకంటక పాలనకు విముక్తి గోదావరి జిల్లాల నుంచే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. మలి విడత యాత్రను కూడా ఇదే పట్టుదలతో విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. మనం ఎంత బలంగా ముందుకెళ్తే.. రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్..
ఇక, ఈ నెల 9వ తేదీ అంటే రేపటి నుంచి రెండో దశ వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది.. ఏలూరు నుంచి తన యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు జనసేనాని.. రేపు సాయంత్రం 5 గంటలకు ఏలూరు, పాత బస్టాండ్ అంబేద్కర్ కూడలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.. ఇక, 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరులో జనవాణి నిర్వహించనున్నారు.. సాయంత్రం 6 గంటలకు ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం కానున్నరు పవన్.. 11వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు దెందులూరు నియోజకవర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో భేటీకానున్న జనసేనాని.. సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి గూడెం చేరుకుంటారు. ఇక, 12వ తేదీన సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్..



