మణిపుర్‌లో మళ్లీ అల్లరిమూకల విధ్వంసం.. ఇళ్లు, బస్సులకు నిప్పు

 

Manipur : మణిపుర్‌లో మళ్లీ అల్లరిమూకల విధ్వంసం.. ఇళ్లు, బస్సులకు నిప్పు

ఇంఫాల్‌ : మణిపుర్‌లో (Manipur) అల్లరి మూకల విధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మోరే జిల్లాలోని మోరే బజార్‌ ప్రాంతంలో కొందరు దుండగులు పలు ఇళ్లకు ఇవాళ నిప్పు పెట్టారు..

 

అయితే ఆ ఇళ్లలో ఎవరూ నివాసం ఉండట్లేదని తెలిసింది. ఈ ప్రదేశం మయన్మార్‌ (Myanmar) సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలు రవాణా కోసం వినియోగించే రెండు బస్సులను సైతం ఇలాగే ముష్కరులు తగులబెట్టారు. సపోర్మీనా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మణిపుర్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆ బస్సులు దిమాపుర్‌ వైపు నుంచి వస్తుండగా.. స్థానికులు వాటిని అడ్డుకున్నారు. బస్సుల్లోకి ఎక్కి ఇతర తెగ ప్రజలెవరైనా అందులో ఉన్నారా అని సోదాలు చేశారు. ఆ తరువాత వాటిని దహనం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు..

ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌లో దాదాపు మూడు నెలల క్రితం మైతేయ్‌, కుకీ జాతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఆ రాష్ట్రం రావణకాష్ఠంలా రగులుతోంది. వివిధ అల్లర్లలో సుమారు 160 మంది చనిపోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. మొబైల్ రీఛార్జ్, ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర ఆన్‌లైన్ సేవలతోపాటు ఆఫీసులు, వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నవారిపై ఇంటర్నెట్‌ నిషేధం ప్రభావం చూపుతోన్న కారణంగా కొన్ని షరతులతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను హోంశాఖ మంగళవారం నుంచి పునరుద్ధరించింది..

Akhand Bhoomi News

error: Content is protected !!