రాజవొమ్మంగి నుండి ఏలేశ్వరం వెళ్లే రహదారి చిన్నపాటి చెరువును తలపిస్తుంది

రాజవొమ్మంగి నుండి ఏలేశ్వరం వెళ్లే రహదారి చిన్నపాటి చెరువును తలపిస్తుంది

అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి అఖండ

భూమి జులై 28

రాజవొమ్మంగి నుండి ఏలేశ్వరం వెళ్లే రహదారిపై ప్రయాణం నరకప్రాయమేనని ప్రయాణి కులు వాపోతున్నారు. ఏజెన్సీ ముఖ ద్వారమైన ఏలేశ్వరం నుండి గిరిజన ప్రాంతాలకు కలిపే నర్సీపట్నం రోడ్డు వేసి సుమారు 25 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల క్రితం చిధ్ర మైన రోడ్డును పునర్ నిర్మించవలసి ఉండగా లక్షలాది రూపాయల వ్యయంతో తూతూ మంత్రంగా మరమ్మత్తులు నిర్వహించి ఆర్ అండ్ బి అధికారులు చేతులు దులుపుకున్నారు. మరమ్మత్తులు నిర్వహించిన కొన్ని నెలలకే రహదారి పూర్తిగా దెబ్బతింది. మండల పరిధిలోని రమణయ్యపేట గ్రామం నుండి జే అన్నవరం వరకు గల సుమారు పది కిలోమీటర్ల రోడ్డు పెద్ద పెద్ద గోతులతో, చిందరవందరగా కంకర లేచిపోయి కనీసం నడవడానికి వీలులేని దుస్థితిలో ఉంది. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు రోడ్డుపై ఉన్న పెద్ద పెద్ద గోతుల్లో నీరు చేరి చిన్నపాటి చెరువుల్లో తలపిస్తున్నాయి. ఏది రోడ్డు ఏది గుంతో తెలియని పరిస్థితుల్లో వాహనాలు నడపవలసిన పరిస్థితి. ఈ క్రమంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈమధ్య రోడ్డుపై పయనిస్తున్న ఆర్టీసీ బస్సు, ఆటో ప్రమాదాలకు గురయ్యాయి. ద్విచక్ర వాహనదారులు అనేకమంది ప్రమాదాలకు గురై ఆసుపత్రిపాలైన ఘటనలు అనేకం. ప్రధానంగా గిరిజన గ్రామాలను కలిపే ఈ రోడ్డు చాలా ముఖ్యమైనది. గిరిజనుల కు వైద్య సహాయం, పిల్లల విద్యాభ్యాసం, నిత్యాసరాల కొనుగోలుకు తదితర ముఖ్య అవసరాలపై ఏలేశ్వరానికి గిరిజనులు వస్తూ ఉంటారు. సుమారు 15 సంవత్సరాలుగా ఏ విధమైన మరమ్మతులకు నోచుకోని ఈ రహదారి పెద్ద పెద్ద గోతులతో నాలుగు చక్రాల వాహనాలు కూడా పయనించలేని దుస్థితికి చేరుకుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో పాటు అధిక సంఖ్యలో లోడ్ లారీలు తిరుగుతూ ఉంటాయి. ఇదే రోడ్డున ఆనుకొని క్రషర్లు, క్వారీలు నిర్వహింపబడుతున్నాయి. దీంట్లో రేయింబవళ్లు వందలాది లారీలు సుమారు 40 టన్నుల నుంచి 60 టన్నుల వరకు నల్ల కంకర, బౌలర్సు లోడుతో పయనిస్తుంటాయి. దీంతో రోడ్డు చిద్రమవుతున్నది. రవాణా శాఖ అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం పరిపాటి. పటిష్టమైన రోడ్లు నిర్మించడంలో ఆర్ అండ్ బి శాఖ ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంది. 40 టన్నులు లోడ్ మించి వాహనాలు తిరుగుతూ ఉంటే, కేవలం 24 టన్నుల కెపాసిటీ తట్టుకోగల రోడ్లు మాత్రమే వేయడానికి టెండర్లు పిలవడం అన్యాయం. అధిక లోడు లారీల వల్ల వేసిన రోడ్లు వేసినట్లే రెండు మూడు నెలల వ్యవధి లో గోతులమయం అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం వెచ్చించిన కోట్లాది రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. రమణయ్యపేట నుండి జె అన్నవరం వరకు గల రోడ్డు పటిష్టంగా ఉండాలి అంటే 50 టన్నుల కెపాసిటీ తట్టుకోగల నాణ్యమైన రోడ్లైనా వేయాలి, లేదా 24 టన్నుల కంటే అధిక టన్నేజ్ గల వాహనాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. 2022లో రమణయ్యపేట నుండి జె.అన్నవరం వరకూ గల పది కిలోమీటర్ల రోడ్డును ఏడు మీటర్ల వెడల్పు కు విస్తరించి ఎన్ డి బి నిధులతో 24 టన్నుల లోడును తట్టుకునే రోడ్డును పునర్నిర్మించేందుకు సుధాకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ముందుకు వచ్చింది. అయితే రోడ్డుకు ఇరువైపులా వెడల్పు చేసేందుకు ఒకవైపు పనులు ముగించారు. రెండవ వైపు ఆర్ డబ్ల్యు ఎస్ పైప్ లైన్ ఉండడంతో పనులకు ఆటంకం కలిగింది. ప్రభుత్వ ఉదాసీనత, అధికారుల అలసత్వం కలిసి రోడ్డు పునర్ నిర్మాణానికి అడ్డుగోడయింది. ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నా ప్రభుత్వానికి గాని, సంబంధిత అధికారులకు గానీ చీమకుట్టినట్లయినా లేదు. గిరిజన గ్రామాల ప్రజలపై ప్రభుత్వం వివక్షత చూపుతుందని అందువల్లే దశాబ్దాలు గడుస్తున్నా ఆర్ అండ్ బి రోడ్డుకు మోక్షం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. తరచూ ఈ రహదారిపై పయనించి అనేక ప్రమాదాలకు గురై ప్రయాణికులు ఆసుపత్రి పాలైన తరచూ జరుగుతున్నాయని, అనేకమంది అనారోగ్యం పాలవుతున్నారని అయినా ప్రభుత్వానికి కనికరం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పయనిస్తున్న దుస్థితిలో రోడ్లు ఉన్నాయనేది ప్రయాణికుల ఆవేదన. మైదాన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు రోడ్లను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి గిరిజనులు మనుషుల్లా కనబడటం లేదని గిరి పుత్రులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత జిల్లా ఉన్నత అధికారులు స్పందించి రమణయ్యపేట గ్రామం నుండి జె. అన్నవరం గ్రామం వరకు గల ఆర్ అండ్ బి రహదారిని త్వరితగతం నిర్మించి నరకప్రాయమైన ఆర్ అండ్ బి రోడ్డు నుంచి గిరిజనులకు విముక్తి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!