నాతవరం మండలం గునుపూడి గ్రామంలో జగనన్న కాలనీ ఎక్కడా అని నర్సీపట్నం ఎమ్మెల్యేను జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ప్రశ్నించారు. జనసేన పార్టీ ఆదేశాల మేరకు రెండో రోజు ఆదివారం నాతవరం మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణ ఆధ్వర్యంలో నాతవరం మండలం గునుపూడి గ్రామంలో జగనన్న కాలనీ లేఅవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ గునుపూడి గ్రామంలో నాలుగేళ్ల కాలం గడుస్తున్నా జగనన్న కాలనీలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ఇక్కడ లేఅవుట్ల కోసం ఏర్పడిన స్థల సమస్యను పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్నారు. దీంతో నాలుగేళ్ల కాలంలో గ్రామంలోని పేదలకు ఇల్లు అందించని దాఖలాలు లేవన్నారు. ప్రతీ గ్రామంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని కబుర్లు చెబుతున్నారే కానీ క్షేత్ర స్థాయిలో నిర్మాణాలు మాత్రం జరగని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, అధికారులు స్పందించి ఇక్కడ నెలకొన్న స్థల సమస్యను తక్షణమే పరిష్కరించి పేదలకు ఇళ్లను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, సీనియర్ నాయకులు పోలుపర్తి సూరిబాబు, యూత్ అధ్యక్షులు బైన మురళీ, బల్లా అశోక్, నమ్మి రమణరాజు, శెట్టి తనుజ్, వర్రి అప్పలనాయుడు, పైలపూడి అప్పలనాయుడు, దుర్గాసతీష్, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.


