గర్భిణీలకు తప్పని డోలి కష్టాలు…

 

 

గర్భిణీలకు తప్పని డోలి కష్టాలు

కారడవిలో ఐదు కిలోమీటర్లు డోలిలో ప్రయాణం

రోడ్డు సదుపాయం కల్పించాలని లక్ష్మీపురం సర్పంచ్ కొర్ర త్రినాథ్ డిమాండ్

అల్లూరి జిల్లా: ముంచంగిపుట్టు మండలం అఖండ భూమి వెబ్ న్యూస్ :

ప్రభుత్వాలు మారిన ఎంతమంది పాలకులు మారిన గిరిజన ప్రాంతంలో ఒకపక్క గర్భిణీలు, మరోపక్క అనారోగ్యానికి గురైన వారికి డోలి కష్టాలు తప్పడం లేదు. మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులు ఎన్ని వినతులు ఇచ్చిన సమస్య పరిష్కారం కావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుమూల గిరిజన గ్రామాలకు కోట్లాది రూపాయలతో రోడ్డు వేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. గిరిజన ప్రాంతంలో సరైన రోడ్డు సదుపాయం లేక వారానికి ఎక్కడో ఒక దగ్గర గర్భిణీలు డోలి కష్టాలు పడుతూనే ఉన్నారు. గర్భిణీలు ఎంతో ఆశతో బిడ్డకు తల్లిని అవ్వాలని, 9 నెలలు కడుపులో మోసి సుఖప్రసవం అవుదాం అనుకుంటే రహదారి సదుపాయం లేక డోలి కష్టాలు తప్పడం లేదు. రోడ్డు సదుపాయం లేక ఐదు కిలోమీటర్లు దట్టమైన అడవిలో నిండు గర్భిణికి డోలీలో మోసుకు వచ్చిన సంఘటన మారుమూల లక్ష్మీపురం పంచాయతీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంచంగిపుట్టు మండలం మారుమూల లక్ష్మీపురం పంచాయతీ ఉబెంగుల గ్రామనికి చెందిన వంతాల బసంతి 19కు గురువారం అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో అర్ధరాత్రి సమయంలో రోడ్డు సదుపాయం లేక తెల్లవారుజాము 6 గంటల సమయంలో వాలంటీర్స్ వంతాల సుబ్బారావు, వంతాల గురుమూర్తి, గ్రామస్తుల సహకారంతో ఐదు కిలోమీటర్లు ఉబెంగుల నుండి సుత్తిగుడ వరకు దట్టమైన అడవిలో గర్భిణీని డోలిలో మోసుకొచ్చి అక్కడి నుండి అంబులెన్స్ సాయంతో ముంచంగిపుట్టు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ త్రినాధ్ ఉబెంగుల నుండి సుత్తిగుడ జంక్షన్ వరకు తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉబెంగుల గ్రామం నుండి బయటకి రావాలంటే చుట్టూ అంత గడ్డలు ఉంటుందని వర్షాకాల సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుందని, ఉబెంగుల గ్రామానికి రోడ్డు వంతెన నిర్మాణాలు చేపట్టాలని, అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి గిరిజనుల కష్టాలు తీర్చాలని ఈ సందర్భంగా కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!