విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదు: మంత్రి పెద్దిరెడ్డి
అమరావతి : అఖండ భూమి వెబ్ న్యూస్ :
విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష ముగిసింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షలో పాల్గొన్నారు.
సమీక్ష అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ”విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదు. ఇవాళ సాయంత్రం ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రుల సబ్‌కమిటీ సమావేశం అవుతుంది. సబ్‌కమిటీ భేటీ చర్చల్లో పాల్గొనేందుకు ఉద్యోగుల ఐకాస నేతలను ఆహ్వానించాం. సమ్మె నోటీసులోని డిమాండ్ల పరిష్కారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం” అని మంత్రి వెల్లడించారు..
ప్రభుత్వం దృష్టికి 12 సమస్యలు: విద్యుత్ జేఏసీ ఛైర్మన్
తమ డిమాండ్ల పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూలంగా చర్చిస్తే సమ్మెను విరమిస్తామని ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. కొంత సమయం అని ఎప్పటినుంచో చెబుతున్నారని.. కాబట్టి ఇప్పడు మరోసారి సమయం ఇవ్వలేమని తేల్చి చెప్పారు. 12 సమస్యలు ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇవాళ సాయంత్రం వరకు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమ్మె ద్వారా వినియోగదారులను ఇబ్బంది పెట్టాలనేది తమ ఉద్దేశం కాదని.. వినియోగదారులు అర్థం చేసుకోవాలని చంద్రశేఖర్ కోరారు..



