రాహుల్‌పై ‘ఫ్లయింగ్‌ కిస్‌’ఆరోపణ.. స్పీకర్‌కు మహిళా ఎంపీల ఫిర్యాదు!

 

 

రాహుల్‌పై ‘ఫ్లయింగ్‌ కిస్‌’ఆరోపణ.. స్పీకర్‌కు మహిళా ఎంపీల ఫిర్యాదు!

దిల్లీ: అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul gandhi) అనుచితంగా ప్రవర్తించారంటూ భాజపాకు చెందిన మహిళా ఎంపీలు ఆరోపించారు.

అవిశ్వాసంపై తన ప్రసంగం పూర్తికాగానే రాహుల్ గాంధీ లోక్‌సభ నుంచి బయటకు వెళుతూ వెళుతూ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) పేర్కొన్నారు. దీనిపై ఆ పార్టీ మహిళా ఎంపీలతో కలిసి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

 

అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తొలుత రాహుల్‌ మాట్లాడారు. తన ప్రసంగం ముగిసిన కాసేపటికే ఆయన బయటికెళ్లారు. వెళ్తూవెళ్తూనే ఆయన ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారంటూ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఆరోపించారు. రాహుల్‌ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘స్త్రీ వ్యతిరేకి మాత్రమే పార్లమెంట్‌లో మహిళా ఎంపీలకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరు. అలాంటి విపరీతాలను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. ఆయన మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ ప్రవర్తన తెలియజేస్తోంది. ఇది అసభ్యకరమైంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

 

ఆయన తన ప్రవర్తనతో మహిళలను అవమానించారని ఆరోపిస్తూ.. భాజపా మహిళా ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన లేఖపై 20 మంది మహిళా సభ్యులు సంతకాలు చేశారు. స్మృతి ఇరానీని ఉద్దేశిస్తూ ఆయన అసభ్యకరమైన సంజ్ఞ చేశారని అందులో పేర్కొన్నారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించి కాంగ్రెస్‌ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై భాజపా ఎంపీ పూనమ్ మహాజన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రెస్‌ గ్యాలరీలో కూర్చున్నవారికి ఆయన వ్యవహరించిన తీరు కనిపించి ఉంటుంది. ఆ ప్రవర్తన సిగ్గుచేటు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎలా ప్రవర్తించాలో తెలిసుండాలి’ అని విమర్శించారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ వర్గాలు తోసిపుచ్చాయి. ఆయన ఏ ఒక్కరినో ఉద్దేశించి ఆయన ఆ సంజ్ఞ చేయలేదని పేర్కొన్నాయి..

Akhand Bhoomi News

error: Content is protected !!