ఏపదాలు కించపరిచేలా ఉన్నాయో జగన్‌ను చెప్పమనండి: పోలీసులతో లోకేశ్
భీమవరం: కొంతమంది పోలీసుల తీరుతో ఆ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ‘యువగళం’ పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం పరిధిలోని బేతపూడిలోని క్యాంప్‌సైట్‌కు వెళ్లారు..
ఈ సందర్భంగా పోలీసు అధికారులతో లోకేశ్ మాట్లాడుతూ వైకాపా శ్రేణులే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయన్నారు. తమను కించపరిచేలా ఫ్లెక్సీలు పెడుతున్నప్పుడు వాటిని ఎలా అనుమతించారని పోలీసులను ఆయన ప్రశ్నించారు. తాడేరు వద్ద వైకాపా శ్రేణులే తమపై రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘యువగళం’ వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో శాంతిభద్రతలకు తానెక్కడా విఘాతం కలిగించలేదని చెప్పారు. యువగళం పాదయాత్ర యువత గళం ప్రభుత్వానికి వినిపించేందుకే తప్ప.. గొడవలు సృష్టించేందుకు కాదన్నారు..



