నర్సీపట్నం నియోజకవర్గంలో పశువైద్యం అందని ద్రాక్షలా మారిందని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ఆరోపించారు. మంగళవారం నాతవరంలోని వెటర్నరీ ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ నాతవరం లో నూతనంగా వెటర్నరీ ఆసుపత్రి భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారని, అయితే డాక్టర్ లేకుండానే ఆసుపత్రిని ప్రారంభించిన ఘనత ఎమ్మెల్యేకే దక్కుతుందన్నారు. మండలంలో గునుపూడి, నాతవరం, శృంగవరం గ్రామాల్లో మూడు వెటర్నరీ ఆసుపత్రులు ఉన్నా వైద్యులు నియమించలేని పరిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని తీవ్రంగా విమర్శించారు. నర్సీపట్నం మండలం వేములపూడి వెటర్నరీ ఆసుపత్రికి కూడా డాక్టర్ లేరన్నారు. నియోజకవర్గంలో అనేక చోట్ల వెటర్నరీ ఆసుపత్రుల్లో ఇన్చార్జ్ డాక్టర్లతో కాలం వెల్లదీస్తున్నారని, దీంతో పాడి రైతులకు చెందిన పశువులకు అనారోగ్యం సంభవిస్తే సకాలంలో వైద్య సేవలు అందటం లేదని ఆరోపించారు. మాకవరపాలెం మండలం రాచపల్లి వెటర్నరీ ఆసుపత్రి భవనం శిధిలావస్థకు చేరిందన్నారు. నాతవరం ఎస్సై బదిలీ అయి మూడు నెలలు కావస్తున్నా ఎస్సై పోస్టు భర్తీ చేయించలేకపోయారన్నారు. ఎస్పై స్థాయి అధికారి నియమించకపోతే మండలంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు. తాము సమస్యలపై ప్రశ్నిస్తే నాయకుల చేత బూతులు తిట్టించేందుకు ఇస్తున్న ప్రాధాన్యత సమస్యల పరిష్కారంలో ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. ఇప్పటికైనా నియోజకవర్గంలోని వెటర్నరీ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాతవరం మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణ, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు గొంప ప్రసాద్, బద్రి, వెలగల నూకరాజు, రేగటి రాజు, చినరాజు, నాగేశ్వరరావు, జొన్న మహేష్, అంబటి లోవరాజు తదితరులు పాల్గొన్నారు.

ANDHRA NEWS PAPER STATE

