సమిశ్రగూడెం గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు ప్రజల వద్ద బలవంతపు వసూళ్లు
నిడదవోలు (అఖండభూమి) అక్టోబర్ 23 : నిడదవోలు మండలం, సమిశ్రగూడెం గ్రామంలో పాత వైయస్సార్ కాలనీకి గత 18 సంవత్సరాల నుండి డ్రైనేజీ, రోడ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు, నాయకులకు ఎన్నో సార్లు వినతులు పెట్టుకున్న సమస్య పరిష్కారం అవ్వలేదు. ప్రజల తిరుగుబాటుతో జిల్లా పరిషత్ నిధులు 6 లక్షలు గ్రామ పంచాయతీ నిధులు 6 లక్షలు మొత్తం 12 లక్షలు కేటాయించారు. కానీ ఆ మొత్తం సరిపోదంటూ మధ్యలో కొంతమంది ఆ కాలనీ వాసుల వద్ద నుండి బలవంతంగా డబ్బును వాసులు చేస్తున్నారు. అక్కడ 100 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కొక్క ఇంటికి 7000 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నట్టు బాధితులు తెలియజేశారు. ఈ విషయంపై గ్రామ కార్యదర్శికి వివరణ కోరగా ప్రభుత్వం డబ్బులతోనే రోడ్లు వేస్తున్నామని ఎవరి వద్దా ఎటువంటి వసూళ్లు చేయడం లేదని ఆలా ఎవరైనా చేసినట్టు రుజువైతే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. స్థానికుల సమాచారం బట్టి ఇప్పటి వరకు 80 మంది లబ్ధిదారుల వద్ద డబ్బులను వసూలు చేసినట్టు తెలిసింది. అందరికి తెలిసే ఈ వసూళ్లు జరుగుతున్నాయని, గ్రామంలోని నాయకుడు దీని వెనుక ఉండి నడిపిస్తున్నారని, ఆ నాయకుడికి వ్యతిరేకంగా ప్రజలు ముందుకు రావడానికి భయపడుతున్నట్టు లబ్ధిదారులు తెలియచేసారు. గతంలో కూడా అదే గ్రామంలో ఒక వీధికి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్డు వేయడానికి ఒక్కొక్క ఇంటి నుండి పదివేల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ వసూళ్లకు అడ్డు కట్ట వేయాలని, వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు.