తాండవ రిజర్వాయర్ గేట్లకు మరమ్మత్తులు చేయించడంలో ఎమ్మెల్యే విఫలం -జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్యచంద్ర

నాతవరంలో తాండవ రిజర్వాయర్ గేట్లకు మరమ్మత్తులు చేయించడంలో ఎమ్మెల్యే గణేష్ ఘోరంగా విఫలం చెందారని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ఎద్దేవా చేశారు. మంగళవారం నాతవర మండలంలో గల తాండవ జలాశయాన్ని సందర్శించి మరమ్మత్తులకు గురైన గేట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ గత ఏడాది డిసెంబరులో ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి రూ.470 కోట్లతో తాండవ ఎత్తిపోతల పథకంకు శంకుస్థాపన చేశారని, ఈ పథకం ద్వారా రెండు జిల్లాలకు చెందిన రైతులకు మేలు జరుగుతుందని, ఈ పథకంను జనసేన పార్టీ హర్షిస్తుందన్నారు. అయితే ఈ పథకంకు శంకుస్థాపన చేసి ఏడాది కావస్తున్నా ఇంత వరకు ఈ పనులు ప్రారంభించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం తాండవ ప్రాజెక్టు గేట్లను మరమ్మత్తులు చేయించలేని మీరు తాండవ ఎత్తిపోతల పథకంను ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. తాండవ గేట్ల మరమ్మత్తుల కారణంగా నీరు వృధాగా పోతుందన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు నీరు అందని పరిస్థితి ఉందన్నారు. శివారు గ్రామాల్లో రైతుల భూములకు నీరు అందక భూములు బీటలు వారిపోయాయన్నారు. తాండవ జలాశయం నుంచి రైతులకు నీరు అందించే ఎడమ, కుడి కాలువల్లో పూడికతీతలు తీయకపోవడంతో శివారు భూములకు నీరు అందని పరిస్థితి ఉందన్నారు. స్థానిక శాసనసభ్యులు గణేష్ విమర్శలకు ఇస్తున్న ప్రాధాన్యత అభివృద్ధిపై కనీసం దృష్టిసారించడం లేదని ఆరోపించారు. ఇటీవల నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన వైసిపి సమావేశంలో తాము ఇన్ని కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశామని ఆర్భాటంగా చెబుతున్నారని, అయితే ఇంత వరకు ఏ కార్యక్రమాలు పూర్తి చేశారో, ఏ కార్యక్రమాలను ప్రారంభించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా తాండవ గేట్లకు మరమ్మత్తులు చేయించి లీకేజీలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాతవరం మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణ, ఈరుడు బద్రి, జనసైనికులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!