జర్నలిస్టులపై భౌతిక దాడులు గర్హనీయం
ఈశ్వర్ పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి*
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మరాజు చలపతిరావు విజయవాడ అర్బన్ మాజీ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు డిమాండ్
విజయవాడ అఖండ భూమి వెబ్ న్యూస్
ఫోర్త్ స్టేట్ గా పిలవబడుతున్న జర్నలిజం రంగంలో పని చేస్తున్న జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడటం సరైన విధానం కాదని సీనియర్ జర్నలిస్టు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మరాజు చలపతిరావు విజయవాడ అర్బన్ మాజీ కార్యదర్శి, నమస్తే బ్యూరో కొండా రాజేశ్వరరావు
ఓ సంయుక్త ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల కేంద్రంలో సీనియర్ జర్నలిస్ట్ బీరే ఈశ్వర్ పై అత్యంత పాశవికంగా దాడులు చేసి హత్యాయత్నానికి పాల్పటం అప్రజాస్వామికమని వారు పంపిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈశ్వర్ పై ఇది రెండవ దాడి అని, రాజ్యాంగబద్ధమైన వాక్ స్వాతంత్య్రాన్ని, పత్రికా స్వేచ్ఛను హరించడం జర్నలిజం రంగానికి గొడ్డలి పెట్టు అని పేర్కొన్నారు. జర్నలిస్టులపై ఇలా భౌతిక దాడులకు పాల్పడుతూ సమాజంలో భయాందోళనలను కలిగించడం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అండగా ఉన్న వారిని మట్టు పెట్టాలనుకోవడం అత్యంత హేయమన్నారు. ఇలాంటి దుశ్చర్యలు ఆటవిక, అనాగరిక చర్యలకు నిదర్శనమని అభివర్ణించారు. జర్నలిస్టుల విధి నిర్వహణలో ఏవైనా వ్యక్తిగత ద్వేషాలు, పొరపాట్లు, తప్పొప్పులుంటే రాజ్యాంగం కల్పించిన వివిధ వ్యవస్థల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలే గానీ, భౌతిక దాడులకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం సర్వత్రా గర్హనీయమని హితవు పలికారు. ఈ విషయమై పోలీసులు వెంటనే స్పందించి బీరే ఈశ్వర్ పై పట్టపగలు దాడులకు తెగబడిన నిందితులను పట్టుకుని చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని, ఇదివరకు జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో ఆ కేసుల్లో నిందితులపై కూడా చర్యలు తీసుకోవాలని నిమ్మరాజు, కొండా కోరారు.