ఈ సంచార జీవులు పర్యావరణ ప్రియులు

ఈ సంచార జీవులు పర్యావరణ ప్రియులు

ఉపాధి వేటలో పర్యావరణానికి పెద్దపీట

చెత్త చెదారం సేకరణ ద్వారా అపారిశుధ్యానికి అడ్డుకట్ట

వేపాడ ఫిబ్రవరి 23(అఖండ భూమి):- ప్లాస్టిక్ భూతం నేటి సమాజాన్ని తీవ్రంగా పట్టి పీడిస్తోందనడంలో సందేహం లేదు. పూర్వం గ్రామాలలో విందు వినోదాలకు అరటి ఆకులు, స్టీలు గ్లాసులు, మట్టి పాత్రలు వినియోగించడం ద్వారా పర్యావరణానికి పెద్దపీట వేసేవారు. కాలక్రమంలో సమాజంలో అనేక మార్పులు సంభవిస్తూ వచ్చాయి. పెళ్లిళ్లు వంటి ఫంక్షన్స్ లో అరటి ఆకులకు బదులుగా అట్ట ప్లేట్స్ వినియోగంలోకి వచ్చాయి.అనంతరం ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి శ్రీకారం చుట్టారు. అన్నం తినే ప్లేట్స్ దగ్గర నుంచి గ్లాసులు, టేబుల్స్ పై క్లాత్ లకు బదులు ప్లాస్టిక్ క్లాత్ ల వాడకం ముమ్మరమయింది. మద్యం షాపులు దగ్గర నుంచి ప్రతి విందు వినోదాల వరకు ప్లాస్టిక్ వస్తువుల వాడకం బాగా పెరిగిపోయింది. అలాగే కుర్చీల దగ్గర నుంచి ఇళ్లల్లో పీటలు, ఇతర పాత్రల వరకు అంతా ప్లాస్టిక్ మయంగా మారిపోయింది. ఇవి చాలవన్నట్లు రాజకీయ పార్టీలు కూడా ప్లెక్షీలను ప్రోత్సహించడంతో సందు సందున గొందు గొందునా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ భూతమే దర్శనమిస్తోంది. దాంతో వర్షాకాలంలో ప్లాస్టిక్ వ్యర్థాలన్ని వర్షాలకు కొట్టుకు పోయి పొలాల్లో తిష్ట వేయడం వల్ల భూగర్భ జలాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. పంటలు కూడా సరిగా పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా వుండగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధానికి శ్రీకారం చుట్టగా న్యాయస్థానం ఆ నిర్ణయాన్ని అమలు చేయకుండా అడ్డుకట్ట వేయడం జరిగింది. అదలా ఉంటే ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించాల్సిన పంచాయతీలు తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం మినహా చేయగలిగింది ఏమీ లేదు. కానీ సంచార జీవులు మాత్రం ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం ద్వారా ఉపాదికి పెద్దపీట వేస్తూ పరోక్షంగా పాలకుల పని భారాన్ని తగ్గించడంలో వారిని పర్యావరణ ప్రియులుగా పేర్కొనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. ఊరూరా తిరుగుతూ చెత్త చెదారంగా రోడ్ల పక్కన, గ్రామాల వీధుల్లో పారేసిన ప్లాస్టిక్ భూతాలను సేకరించి వాటిని కోనుగోలు చేసే యార్డుల వద్దకు వాటిని తరలించి కేజీ ప్లాస్టిక్ ను సుమారు 12రూపాయలకు అమ్మకాలు జరిపి వాటిని ఉపాధిగా చేసుకొని జీవనాన్ని సాగిస్తున్న సంచార జీవులు నిజమైన పర్యావరణ ప్రీయులుగా పేర్కొనవచ్చు.

Akhand Bhoomi News

error: Content is protected !!