లంచం తీసుకుంటూ ఏ సి బి అధికారులకు పట్టుబడ్డ విఆర్ఓ, విఆర్ఏ లు.
నాతవరం మార్చి 4 (అఖండ భూమి)
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం తహశీల్దార్ కార్యాలయం లో ఏసీబీ అధికారులు దాడుల జరిపి ఏడాది గడవక ముందే మరోసారి దాడులు నిర్వహించారు. ప్రభుత్వ సంస్థలలో అవినీతిని అంతమొందించేందుకు 1988 సంవత్సరం లో అవినీతి నిరోధక చట్టం ను ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం అవినీతిపై కొరడాను విసిరేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నా ఇప్పటికీ ప్రజలకు సేవలందించేందుకు నియమించబడ్డ ప్రభుత్వ అధికారులు చట్టాన్ని లెక్కచేయకుండా ధిక్కరిస్తూ పేద ప్రజల నుంచి కాసులకు కక్కుర్తిపడి లంచాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు. ఏటా అనేక అవినీతి తిమింగలాలు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులకి చిక్కి జైలు పాలవుతున్నా కొంతమంది ప్రభుత్వ అధికారులలో పరివర్తన రావడం లేదు. తాజాగా సోమవారం మరో రెండు అవినీతి తిమింగలాలు ఎసిబి అధికారుల చేత చిక్కాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుమ్మిడి గొండ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి భూమి పాస్ బుక్ మ్యుటేషన్ కొరకు ఆ గ్రామ రెవెన్యూ అధికారి జర్తా సింహాచలం ని సంప్రదించగా 8 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో ఆయన ఏ సీ బి అధికారులకు సమాచారమిచ్చారు. దీనితో తహశీల్దార్ కార్యాలయం లో సోదాలు నిర్వహించి వారి నుంచి నగదు స్వాధీనం చేసుకుని విచారణ జరిపి గ్రామ రెవెన్యూ అధికారి జర్త సింహాచలం మరియు గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ చెవల లోవరాజు ను ఏసిబి అధికారులు అదుపులోనికి తీసుకున్నారు.