ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
శంఖవరం, (అఖండభూమి వెబ్ న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అన్ని వసతులు కల్పించినప్పటికీ ప్రైవేట్ పాఠశాలపై మక్కువతో అత్యధిక శాతం విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల వైపు బాట పడుతున్నారు. ఇదే అలుసుగా తీసుకుని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం తమకు నచ్చిన రీతిలో వ్యవహరిస్తూ ధన సంపాధనే ధ్యేయంగా నడుచుకుంటున్నారు. ఇదే బాటలో మండలంలోని కత్తిపూడి శివారు సీతయమ్మ పేట గ్రామంలో గల రిఫరల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను తల్లిదండ్రులను ఫీజులు పేరుతో మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేయడమే కాకుండా సంవత్సరాంతం లోపు కట్టవలసిన ఫీజును రెండు దఫాలుగా చెల్లించాలని అది కూడా ఆరు నెలల లోపే కట్టవలెనని తమ సొంత నిర్ణయాలతో ఫీజులు వసూలు చేస్తున్నారు. సగం ఫీజును జూన్ నెలలోనే కట్టాలని మిగతా సగం ఫీజును అక్టోబర్ నెలలోపు పూర్తి చేయాలని లేని పక్షంలో పరీక్షలు నిర్వహించమని, బస్సు ఎక్కించుకోమని విద్యార్థులను తల్లిదండ్రులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు.విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లిదండ్రులకు పుస్తకాలు కొనడంతో పాటు ఫీజులు భారం కూడా ఉండడంతో కట్టలేని పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు విద్యార్థులను చదువు మధ్యలోనే మానిపించడం జరుగుతుంది. ఫీజులు, పుస్తకాలు తనకు ఇష్టం వచ్చినట్లు రేట్లు వేయడమే కాకుండా మా స్కూల్ యందు పుస్తకాలు మాత్రమే వాడవలెనని బయట పుస్తకాలు అనుమతించబడవని అత్యధిక మొత్తం వసూలు చేయడం జరుగుతుంది.ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వసూలు చేయవలసిన ఫీజులు కన్నా అత్యధికంగా వసూలు చేయడమే కాకుండా సగం సంవత్సరం పూర్తి కాగా కాకుండానే మొత్తం చెల్లించాలని దౌర్జన్యం చేయడం తల్లిదండ్రులను ఆందోళన గురిచేస్తుంది. ఏ పాఠశాల నందు మొత్తం ఫీజు సగం అక్టోబర్ లోపే కట్టించాలని ఎక్కడ నిబంధనలు లేవు కానీ రిఫరల్ స్కూల్ నందు మాత్రం ప్రిన్సిపాల్ మరియు యాజమాన్యం కలిసి తమ సొంత నిర్ణయాలతో ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. ఇదే విషయంపై మండల విద్యాశాఖ అధికారి వారిని వివరణ కోరగా అర్థ సంవత్సరం ఫీజు మొత్తం చెల్లించాలని నిబంధనలు ఏమీ లేవని సంవత్సరం లోపు టెర్మ్స్ ప్రకారం ఫీజు కట్టుకోవచ్చని తెలిపారు.