ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ ను తక్షణమే రద్దు చేయాలి – డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్
ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ ను తక్షణమే రద్దు చేయాలని వర్గీకరణ చేస్తే కూటమి పార్టీలు ఇంకెప్పటికీ అధికారంలోకి రావని ఇదే చివరి అవకాశమని రాక్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ రత్నాకర్ హెచ్చరించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీల కుట్రపూరిత వర్గీకరణ వ్యతిరేక గర్జన ఉద్యమం (రాక్స్)తో అనేక గ్రామాల్లో పర్యటిస్తూ లక్షల సంఖ్యలలో ప్రజలను కలిసి ఉత్తేజపరుస్తూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు బలమైన నాయకత్వం తో సన్నద్ధం చేస్తున్నామని, ఈ కుట్ర పూరిత వర్గీకరణను జరగనివ్వమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు తెలుగు దేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఈ ఎస్సీల వర్గీకరణేయని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ జోలికి వస్తే ఆ పార్టీ లకు ఇదే ఆఖరి గెలుపు అవుతుందని మరల ఎప్పటికీ అధికారంలోకి రాలేరని ఆయన హెచ్చరించారు. దేశంలో ఎస్సీల అభివృద్ధి అంతంత మాత్రమేనని రాజ్యాంగ ఫలాలు వారికి అందటం లేదని నేటికీ వారి స్థితిగతులు మారలేదని వాటిపై కమీషన్ వేసి నివేదికల ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.